పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/130

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అతలరాజ్యముకథ.

117

ప్రతీహారికాజ్ఞాపించెను. అతండరిగి యత్తెఱవకై నలుమూలలు వెదకిన నెందును గనంబడలేదు. అందలివార లాసుందరి యప్పుడే పోయినదని చెప్పిరి. ద్వారపాలుఁ డామాట వీరవర్మ కెఱంగించెను.

వీరవర్మ తనతమ్ముఁడా వీటిపై దండువత్తునని వ్రాసినదివసము లెక్కించుకొనుచు నాఁటి యుదయమునఁ బెందలకడలేచితురగారూఢుండై యతండువచ్చుమార్గమున కెదురుగాఁబోయెను. అప్పుడేసుధన్వుఁడు యక్షసేనాపరివృతుండై వచ్చుచుండెను. ఇరువురు మార్గమధ్యంబునఁ గలిసికొనిరి. సుధన్వుఁ డన్నగారింగురుతుపట్టి యోహోహో నాప్రియసోదరుఁడు వీరవర్మయే. నేఁడెంతసుప్రభాతము అని పలుకుచు గుబాలున గుఱ్ఱముడిగ్గనుఱికి యతనింగౌఁగిలించుకొనియెను, పెద్దతడవునకు నెలుంగురాల్పడ అన్నా ! యెట్లుబ్రతికితివి! నీయునికి వజ్రకంఠుఁ డెఱుఁగునా! యీగుఱ్ఱమెట్లువచ్చినది? అనియడిగిన సంతసముతో నాతండు తనవృత్తాంతమంతయు నెఱింగించి యిప్పుడునేనే యీభూమి పాలించుచుంటిని. నీవాదానవునిపేర వ్రాసినకమ్మఁ జూచి యిట్లు వచ్చితినని యెఱింగించెను. సుధన్వుండును తనవృత్తాంతమంతయుఁ బూసగ్రుచ్చినట్లు తేలియఁజేసి యతనివిస్మయసాగరమున నీఁదులాడఁ జేసెను.

తనకుఁ బ్రాణదాయినియైన రత్నావతి యన్నగారియంతఃపురముననున్నదని విని మిగుల నానందించుచు యక్షకాంతలనెల్ల త్రికూటశైలాంతరమునకనిపి తా నన్న వెంట నగగిలోనికిం జనియెను. వీరవర్మ తనభార్యకు దమ్మునింజూపుచు నతనిచిత్రమంతయుఁ జెప్పెను. ఆమె యాశ్చర్యపడుచు రత్నావతిని దీసికొనివచ్చి యచ్చిగురుఁబోడిచేసిన యుపకార ముగ్గడించుచు సుధన్వునికిఁ జూపినది. సుధన్వుండా యెల నాగంజూచి సంతోషము పట్టజాలక తటాలున చేయిపట్టుకొని ముద్దుపెట్టుకొనుచు నాముద్దుగుమ్మను బెద్దగా నగ్గించెను. అదియే పాణిగ్రహణ మహోత్సవమని యెల్లరు చప్పటులుకొట్టిరి.