ఈ పుట ఆమోదించబడ్డది

50.తే. సిద్ధిమంతుండు బ్రహ్మంబుఁ జేరుతెఱఁగు
సంగ్రహంబుగ నీ కిప్డు సవ్యసాచి!
చెప్పెదను జ్ఞానమున కెల్ల శ్రేష్ఠమైన
నిష్ఠ యియ్యదియే; దీని నెఱుఁగవలయు.

51. తే. బుద్ధి నెలకొల్పి మిగుల విశుద్ధరీతి
నచల మైనట్టి ధృతి నియతాత్ముఁడగుచుఁ
బంచతన్మాత్రలనుబట్టి పాఱఁదోలి
రాగమును ద్వేషమును విసర్జనము చేసి.

52. తే. అల వివిక్తసేవియును లఘ్వాశియు నయి
వాక్శరీరమనఃపరి పాలనంబు
సలిపి ధ్యానయోగమున నాసక్తి గలిగి
యనవరతమును వైరాగ్యమాశ్రయించి.

53. తే. కామమును గ్రోధమును నహం కరణ దర్ప
బల పరిగ్రహముల మాని మమత వీడి
యంతరింద్రియ బహిరింద్రియములశాంతి
బడయుపురుషుండు తగు బ్రహ్మ భావమునకు.

54. ఆ. బ్రహ్మభూతుఁ డాత్మ పరిశుద్ధిఁ గన్నవాఁ
డగుట దుఃఖములను దగులఁబోఁడు
కోర్కి గనఁడు భూతకోటికి సమదృష్టి
వరుఁడు, పరమభక్తి వరుఁడు నాకు.

55. ఆ. ఏను నిశ్చయముగ నెట్టివాఁడనొ మఱి
యెవఁడ ననుట భక్తి నెఱుఁగఁగలఁడు;
అటులు నాయథార్థ మంతయు భక్తిచే
నరసి నన్నుఁ జేరునతఁడు పార్థ!