ఈ పుట ఆమోదించబడ్డది

40.ఆ. మ్రొక్కువాఁడ ముందు మ్రొక్కువాఁడను వెన్క
మ్రొక్కువాఁడ సర్వదిక్కులందు;
అమితవిక్రముఁడ వనంతవీర్యుండవు;
జగతి కాత్మ వగుట జగతి వగుదు.

41. తే. సఖుఁడ వని యెంచి వినయంపు సరణి మాని
యిట్టి నీ మహ్యత్సంబు నేనెఱుఁగ లేక
యోయి సఖ! యోయి మాధవ ! యోయి కృష్ణ!
యనుచుఁ బొరపడి యైన స్నేహమున నైన,

42. తే. శయ్యల విహారభోజన సమయములను
అందఱసమక్షమునను నేకాంతమునను
బరిహసించుచు విర్లక్ష్యభావమంది
పలికినది యెల్ల క్షమియింపవలయు దేవ!

43. ఆ. తండ్రి వగుదు వీవు ధరఁ జరాచరముల
కరయఁ బూజ్యుఁడవును గురుఁడ వగుదు;
త్రిభువనములయందు దేవేశ! నీ సముం
డుండఁ డన్న నధికుఁడుండునొక్కొ!

44. తే. కనుక జగదీశ! నీపాదకమలములకుఁ
బ్రణుతిఁ జేసెద న న్ననుగ్రహము సేయు;
సుతుల జనకుండు మఱియు స్నేహితుల సఖుఁడు
ప్రియను బ్రియుఁడునుబోలె సైరింపవలయు.

45. ఆ. ముందు గననిరూపమును జూడ సంతోష
మయ్యు స్వాంతమున భయంబు గలిగె;
తొలుతఁ గల్గురూపు తోయజేక్షణ ! చూపు
సుప్రసన్నుఁడ వయి సొంపు గూర్ప.