పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/108

ఈ పుట ఆమోదించబడ్డది

స్మరించుకొంటూ ఆ ప్రభువుకి ఇంతవరకు నేను ఏమి సేవ చేసాను? ఇప్పుడు ఏమి సేవ చేస్తున్నాను? ఇకమీదట ఏమి సేవచేస్తాను అని ధ్యానించుకొనే అంశం వస్తుంది - 53.

పదహారవ శతాబ్దంలో చీలిపోయిన ప్రోటస్టెంటు శాఖలు సిలువ ఆకృతిని నిరాకరించాయి. ప్రజలు సిలువపట్ల పిచ్చి భక్తిని చూపుతున్నారని వారి అభిప్రాయం. క్రీస్తునిగాని, పునీతులనుగాని స్వరూపాల రూపంలో పూజించడానికి వాళ్ళు ఇష్టపడరు. ఈ శాఖల్లో "లూతరు వర్గీయులు మాత్రం సిలువను కొంచెం ఎక్కువగా వాడుతారు. మొత్తంమీద క్యాతలిక్ సమాజంలో వుండే సిలువభక్తి ప్రోటస్టెంటు సమాజాల్లో లేదనే చెప్పాలి.

3. సిలువగుర్తు వేసికోవడం

భక్తులు నొసటిమీద సిలువగుర్తు వేసికోవడం రెండవ శతాబ్దంలోనే వాడుకలో వుండేది. కాని ఈ యాచారం 4వ శతాబ్దంలోనే బాగా వాడుకలోకి వచ్చింది. తర్వాత నొసటి మీదా రొమ్మమీదా గూడ ఈ గుర్తువేసికొనే పద్ధతి అమలులోకి వచ్చింది. కొందరు దివ్య సత్రసాదంతో గూడ నొసటిమీద కండ్లమీద సిలువగుర్తు వేసికొనేవాళ్ళు. పెదవుల మీద ఈ గుర్తు వేసికొనే పద్ధతి 8వ శతాబ్దంలో వచ్చింది, నొసలు, రొమ్ము భుజాలమీద పెద్ద సిలువ గుర్తు వేసికొనే ఆచారం 10వ శతాబ్దంలో గాని వాడుకలోకి రాలేదు. మొదట నొసటమీదా రొమ్ముమీదా ఆ పిమ్మట కుడి భుజంమీద, కడపట ఎడంభుజంమీద చేతిని త్రిప్పేవాళ్ళు తర్వాతి కాలంలో చేతిని ఎడమ భుజంమీదినుండి కుడిభుజం మీదికి త్రిప్పడం మొదలుపెట్టారు. ఇప్పటికీ ఈ పద్ధతే కొనసాగుతూంది.

సిలువ గురుతు వేసికొనేపుడు భక్తిని కలిగించుకోవడానికి కొన్ని మాటలను గూడ ఉచ్చరించేవాళ్ళు "పిత పుత్ర పవిత్రాత్మ నామమున" అనే మాటలు అతి ప్రాచీన కాలం నుండీ వాడుకలో వున్నాయి. వీటికి బదులుగా గ్రీకు క్రైస్తవులు "ఓ పవిత్రుడవైన దేవా, ఓ పవిత్రుడువూ బలవంతుడవూ ఐన దేవా, ఓ పవిత్రుడవూ అమర్త్యుడవూ ఐన దేవా మాపై దయజూపు" అనే మాటలు వాడతారు.

ఐతే నరులను సిలువ గురుతుతో ఆశీర్వదించడంలో అర్థమేమిటి? ఇక్కడ చాల అర్ధాలున్నాయి. ఆ నరులు క్రీస్తు ముద్రను స్వీకరించి ఆ యజమానునికి చెందుతారని ఒక భావం. వారు క్రీస్తుని విశ్వసిస్తున్నారని మరొక అర్థం. ప్రభువు పిశాచ శక్తినుండి మనలను కాపాడతాడని మరొక భావం. క్రీస్తు సిలువ మనలను రక్షించాలనిగాని అతని వరప్రసాదం మనలను కాపాడాలనిగాని ఇంకొక అర్థం. ఈ సిలువ గుర్తుతో నరులనూ వస్తువులనూ గూడ ఆశీర్వదించవచ్చు.