ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

భోజరాజీయము ఆశ్వా. 2


క.

ఆకర్ణించి మహుండు 'ప్ర
భాకరసమతేజ! నీకృపం బుణ్యకథల్
నాకు విన నయ్యె భోజుం
డేకరణిఁ జరించె సిద్ధుఁ డే మైఁ జనియెన్.'

181


వ.

అని తదనంతరకథాకర్ణనోత్సుకుం డయి యడిగిన.

182


చ.

సరసిజనాభ! భక్తజనసంచితపుణ్యఫలప్రదాన! వా
గ్వరనుతపాదపంకజ! జగన్నివహాభయదానభూమ! మం
దరగిరిమూలమండిత! రథాయితచారుఖగాన్వయేశ! శం
కరరమణీసదాస్మరణకారణనిర్మలనామశోభితా!

183


క.

గర్వితహిరణ్యకశిపు వ
పుర్విదళనకరణఘననిపుణనఖనికరా
పూర్వాయుధ! కరసంభృత
సర్వాయుధ! దురితతిమిరచండమయూఖా!

184


మత్తకోకిల.

నీలనీరదచారుకోమలనిర్మలాంగ! విజృంభితా
భీలదానవమానమర్దన! భీమనక్రగృహీతశుం
డాలభీతినిరాస! ఘోరకురారలూనసమస్తభూ
పాలకానన! సన్మునీశ్వరపాలనా! నరకేసరీ!

185

గద్యము
ఇది వాణీవరప్రసాదలబ్దవాగ్విభవ తిక్కనామాత్యసంభవ
సుకవిజనవిధేయ అనంతయ నామధేయ ప్రణితంబైన
భోజరాజీయంబను కావ్యంబునందు
ద్వితీయాశ్వాసము