జారుఁడై దుష్ట ప్రచారుఁడై పాపవి చారుఁడై బహు దురాచారుఁడగుచు హీనుఁడై మూర్ఖ సంతానుఁడై త్యక్తాభి మానుఁడై నిరతాప్రమాణుఁడగుచు దుష్టుఁడై సజ్జన కష్టుఁడై కోప సం దష్టుఁడై నిజకుల భ్రష్టుఁడగుచుఁ గ్రోధియై బంధు విరోధియై బహుజన బాధియై భుధమనో వ్యాధి యగుచుఁ బరగుచున్నట్టి నిర్భాగ్యవరుఁడు తనదు పాట్ల నిక్కడ యగునె యా పయిని గాక భూరిమయవాస! కోలంకపురనివాస మదనగోపాల రాధికాహృదయలోల!
యేపి నందలము పైకెక్కించినను గ్రింది కురువడి పుల్లెల కురుక కున్నె పిల్లిని గద్దియఁ బెట్టి పూజించిన నుచ్ఛిష్ట భక్షణం బుడుగఁగలదె బలు చక్కెరల యుక్కెరలఁ గాకిఁ బెంచిన కారుకూఁతలు గూయఁ గణఁగకున్నె దున్నపోతుకు నెన్ని వన్నెలు దిద్దిన బురద గోతులలోనఁ బొరలకున్నె నీచ మనుజుని బుధులు మన్నించి పేరఁ బిలిచినను వాని గుణము జూపింప కున్నె భూరిమయవాస! కోలంకపురనివాస మదనగోపాల రాధికాహృదయలోల!
కలిగిన మాత్ర మర్థుల కొసంగని వాఁడు నొరుల కల్మికి దుఃఖ మొందు వాఁడు సంతత దుర్ణయాచారుఁడై దగు వాఁడు పరుల బాధింపఁ బాల్పడెడు వాఁడు