పుట:2015.373190.Athma-Charitramu.pdf/348

ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 308

పంతులుగారు నావలెనే విఫలమనోరథులై వెనుకంజవేయుదురేమో యని నేను వెఱగందితిని. దైవానుగ్రహమువలన వారి కన్ని శుభములు సమకూరవలయు నని కోరితిని.

నా సలహామీఁద శ్రీచిలుకూరి వీరభద్రరావుగా రిపుడు బెజవాడ రావలె నని యుద్దేశించిరి. 98 వ సంవత్సరారంభము నుండియు మే మిరువురమును గలసి యొక యాంగ్లాంధ్ర వారపత్రిక నెలకొల్ప నుద్యమించితిమి. రావుగారికిని వారి ముద్రాలయమునకు వలసిన యొక బస నేర్పాటు చేయుటకు మిత్రులు నేనును వెదకితిమి.

ఈ శీతకాలపుసెలవులలో కొంచెము జబ్బుగ నుండిన నా భార్యను జూచిపోవుటకు నా యత్తగారు, బావమఱఁదియు బెజవాడ వచ్చిరి. వెంకటరామయ్య రేపల్లెనుండి బెజవాడకు వచ్చి న్యాయవాదిపరీక్షకై మద్రాసు వెడలిపోయెను. తలిదండ్రులను జూచివచ్చుటకు నేను డిశెంబరు 18 వ తేదీని రాజమంద్రి వెళ్లితిని. కృష్ణమూర్తిభార్య నంజువ్యాధితో బాధపడుచుండెను. కుటుంబవ్యవహారములను గుఱించి తలిదండ్రులతోను, తమ్ముఁడు కృష్ణమూర్తితోను నేను మాటాడితిని. మా సంసారమున వ్యాధులవలెనే అప్పులును దినదినప్రవర్ధమాన మగుచుండెను ! బాధ్యతలు హెచ్చుచుండెను. దూరమున రాజమంద్రిలోనుండు జననీజనకులను నేను సరిగాఁ గనిపెట్టనేరకుంటిని కాన, పిల్లలతో వారు బెజవాడ వచ్చినచో, అందఱును సౌఖ్యమును మనశ్శాంతిని ననుభవింతు రని తలిదండ్రులకు బోధించి, వారలను విజయవాడ కాహ్వానించితిని. వా రొకవిధముగ సమ్మతించిరి.

పెద్దయప్పు లటుండనిచ్చి, మా చిల్లర యప్పులే రాజమంద్రిలో పెరిఁగిపోవుచుండెను ! మా సంసారము రాజమంద్రినుండి తరలించుటకు