పుట:హరవిలాసము.pdf/9

ఈ పుట ఆమోదించబడ్డది

10

పీఠిక.


పైకారణములఁబట్టి శ్రీనాథుఁడు క్రీ. శ. 1384 సం. ప్రాంతమున జన్మించి 1455 సం ప్రాంతమువఱకు 70 సంవత్సరములు జీవించియుండవచ్చునని యూహింపవలసియున్నది.

మహారాజాస్థానముల గవిసార్వభౌముఁడై మహాభోగముల ననుభవించినవాఁడయ్యును నవసానదశయందు బలుకష్టములపా లగుట యౌవనదశలో శృంగారనాయకుఁ డయి స్త్రీలోలుడై విశృంఖలప్రవృత్తిచే ధనమెల్ల వెచ్చవెట్టి దేహమును సైతము చెఱచుకొన్న పాపపుఫలముగాని యన్యముగాదని కొంద ఱందురు.

శ్రీనాథుఁడు లాక్షణికోత్తముఁ డగుమహాకవి. ఈకవిబ్రహ్మ కావ్యప్రపంచకల్పనాచాతుర్య మవాఙ్మానసగోచరము. వర్ణనాసందర్భముల నర్థగంభీరము లగుమృదుపదముల బొందుపఱచి రసమును విడనాడక మనోహరంబుగఁ గవనమల్లు ననల్పకౌశల మీతని కలవడినట్లు మఱియొక్కకవి కలవడలేదు. "కాశీఖండ మయఃపిండం నైషధం విద్వ దౌషధమ్' అని కొనియాడఁబడు నీ రెండుగ్రంథముల భాషాంతరీకరణములవలననే యీ కవిపాండిత్య మనర్గళ మని తెల్లము గాఁగలదు. ఈతనికవిత్వము మొత్తముమీఁద సంస్కృతపదభూయిష్ఠమై మనోహరమైయుండును. లోకములో నాంధ్రభాషాసాహితిఁ బడయఁగోరు విద్యార్థులు శ్రీనాథుని గ్రంథములఁ జక్కఁగఁ జదివిన మఱియొక గ్రంథముఁ జదువవలసిన పనియుండదనియే నానమ్మకము.

ఇతడు మహాకవియై యుండియుఁ బారలౌకికచింతమై భగవంతున కొక కృతియైన నీక తనగ్రంథములన్నియు నర్థలోభమున మనుజుల కిచ్చుట చూడ నెంతయు విచిత్రముగ నున్నది.

ఈయన పండితారాధ్యచరిత్ర, మరుత్తరాడ్చరిత్ర, శాలివాహన సప్తశతి, శృంగారనైషధము, భీమఖండము, కాశీఖండము, హరవిలాసము, నంధనందనశతకము - అనుగ్రంథముల రచించి జగద్విఖ్యాతిఁ బడసెను. పల్నాటివీరచరిత్రమునుగూడ రచించినట్లు చెప్పఁబడియున్నది. కాని ప్రాసము లేనియట్టి తక్కిరిబిక్కిరి ద్విపదకవిత్వ మల్లియుండునా