పుట:హరవిలాసము.pdf/75

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మ. దరహాసంబుల భ్రూలతానటనచేతన్ విభ్రమప్రౌఢిమన్
బరిహాసోక్తుల భావగర్భరససంపత్తిస్ఫుటాలోకన
స్ఫురణాభంగుల మౌనికాంతలమనంబు ల్చూఱలాడెన్ మహే
శ్వరుఁ డుద్దామవిలాసదారువనికావాటప్రదేశంబులన్. 52

సీ. సుబలమార్కండేయశునకమౌంజాయన మాండవ్యగోత్రసంభవులయిండ్ల
బకదాల్భ్యరైభ్యకభల్లకిజతుకర్ణకణ్వకుత్సాన్వయాగ్రణులయిండ్ల
ఘటజానుకాత్రేయకటకలాపసుమిత్రహరివక్త్రమునివంశధరులయిండ్ల
వాయుభక్షకభార్గవవ్యాసజైమినిశుకకపిలకులప్రసూతులిండ్ల
తే. బుణ్యగృహిణులఁ బతిభక్తిపూర్ణమతుల, భాగ్యసంపన్నలను బుత్రపౌత్రవతుల
సతుల ముత్తైదువుల నిర్విశంకవృత్తి, రజనికరఖండమౌళి విరాళి గొలిపె. 53

వ. ఇట్లు ప్రతిగృహంబున భిక్షాటనంబు సేయుచు మహోక్షలాంఛనుఁడు వాంఛానుకూలప్రకారంబునం జోరరతవ్యాపారపారాయణుండై మగలకన్ను మొఱంగి సంధ్యాసమయంబుల ననుష్ఠానార్థంబు పురుషులు సమిత్కుశఫలాహరణార్థం బెందేనిం జనినయడరు వేచి శపథశతక్షతోష్ణంబును నిరుద్ధనిశ్వాసోత్సాహంబును నివారితోల్లాసంబును నిమేషమాత్రసాధ్యంబును నిబిరీసభయకంపంబు నైనసంభోగంబు లభిలషించు నారంభోరువుల మనంబు లెఱింగి సంకేతస్థానకేళికలను నికుంజక్రోడసంవేశక్రీడలను వాతదూతీపరామర్శంబులను భ్రూలతాదేశంబులను నపాంగరంగస్థలాస్యలంపటకటాక్షవీక్షావి క్షేపంబులను మందహాసకందళితపరిస్పందంబులఁ గందర్పపరబ్రహ్మానందం బనుభవింపం జేసి మిసిమింతుండునుంగాక దేవదారుకాంతారమధ్యంబున. 54

సీ. మువ్వన్నెపులితోలు మొలదిండుగాఁ గట్టి కర్కోటకాహి బాగగ బిగించి
చిలువపోఁగులను వ్రే ల్చెవులఁ గీలన చేసి వలరాచనీరు మైఁ గలయ నలఁది
చిన్నారిపొన్నారిశిశిరాంశుఁ దలఁదాల్చి కొనగోటిజత లేడికొదమఁ బూని
పచ్చియేనికతోలుపచ్చడంబు ధరించి గిలుకుమువ్వలకోలఁ గేలఁ బట్టి
తే. పసిఁడిజలపోసనముతోడ నెసఁక మెసఁగు, బిసరుహాననుపుఱియకప్పెర ధరించి
పెద్దనడివీథి నిలుచుండి భిక్ష యడుగు, నాశ్రమంబునయందు ఖట్వాంగపాణి. 55

వ. ఇవ్విధంబున మన్మథమథనుండు మదనోన్మాదంబునం గన్నుగానక మునికళత్రంబుల
పాతివ్రత్యంబులు పొలిపుచ్చుచు విచ్చలవిడిఁ జరియింపం బూనిన నిలింపమౌనివ్రాతంబు వారివారికి నెఱింగి గుజగుజవోవుచు వంచనంబు ప్రకాశింపంజాలక లోలోన యడంచుకొని యుండుచుండ నప్పాటం బ్రతిభవనంబునఁ బాటిల్లు చీఁకటితప్పు