66 హరవిలాసము
గంబు ఫలియింప వివాహదీక్షాతిలకంబు లలాటంబునం దీర్చె యధిష్ఠానాంతరసన్నివేశంబై ధాత్రీప్రతిసార్యమాణం బైనపూర్ణకౌతుకహస్తసూత్రంబు బంధించి మేనకాదేవి బాష్పాకులలోచన యయ్యె నప్పుడు నవఫేనపుంజ యగుదుద్ధాబ్ధివీచి పోల్కిఁ బట్టుపుట్టంబు గట్టి చెలువారు నాసరోరుహాక్షి కులదేవతలకు మొక్కి ముత్తెదువల కభివాదనంబు సేసి కళ్యాణమండపమ్మునం దఖిలపరివారపరివృతయై సిహాసనంబుమీఁదం గూర్చుండి మహోక్షలాంఛనునాగమనంబుఁ బ్రతీక్షించుచునుండె నంత. 86
సీ. బ్రాహ్మి సంపాదించె భసితాం రాగంబు మాహేశి రుద్రాక్షమాలఁ గూర్చె
గౌమారి వెలయించె గజచర్మచేలంబు వైష్ణవి తోలుదువ్వలువ మడిఁచె
వారాహి కెంగేల గారాపువ్రేలికిఁ గైసేసె మణిమయకల్పపఙ్క్తి
నింద్రాణితోఁ గూడి హేరాళముగ గ్రుచ్చెఁ జాముండ హస్తభూషావ్రజంబు
తే. నాదికాలంబు సతిఁ బెండ్లియాడఁబోవు, నవసరంబున నెబ్భంగి సవదరించె
దివ్యశృంగార మబ్బంగి దేవదేవుఁ, డాదరించెను సమ్మోద మావహిల్ల. 87
సీ. భసితంబు కర్పూరపాళికస్తూరికాభరితాంగరాగసంపద వహించె
పచ్చియేనుఁగుతోలు పసిఁడికమ్ములపట్టుపచ్చడం బనెడివిభ్రమముఁ దాల్చె
భుజమధ్యమునఁ గ్రాలు భోగిభోగంబులు తారహారములచందంబు నొందె
జేగుఱించినకంటిచిగురుచాయలతీఱు సిందూరతిలకంబుచెలువు నించె
తే. దినమునందును వెన్నెల దీటుకొనఁగ, శైశవంబున విగతలాంఛనతఁ జెంది
చాల నొప్పారుసుకుమారచంద్రరేఖ, తనకుఁ దాన చూడామణిత్వము వహించె. 88
వ. ఇవ్విధంబున గంగాధరుండు సమాసన్నగణాపనీతం బైనఖడ్గంబున నీడఁజూచి నందిభుజావలంబియై శార్దూలచరపిహితపల్యాణబంధం బగువృషభంబును గైలాసశిఖరంబుంబోలె నారోహణంబు సేసి బ్రాహ్మి మొదలయిన మాతృకలును గపాలాభరణయైన భద్రకాళియు భృంగిరిటనికుంభధరభద్రకాళప్రముఖప్రమథపరివారంబునుం బరివేష్టింప భూతబేతాళశాకినీడాకినీగణంబులు మురాయింపం ద్వాత్రింశత్కోటిదేవతాసమూహుబులుఁ గొలువ సహస్రరశ్మిధవళాతపత్రంబు ధరియింప గంగాయమునలు వింజామర లిడ నుభయపార్శ్వంబుల నిజవాహనారూఢులై హరివిధాతలు వేత్రహస్తులై తలంగుండు పాయం దొలంగుం డనుచు సందడి నెడఁ గలుగఁజేయఁ గలహాశనతుంబురులును విశ్వావసువులును హాహాహూహువులును ద్రిపురవిజయాదివిద్యాధరులును ద్రిపురవిజయాదికంబు లుగ్గడించుచుండ సప్తర్షు లరుంధతీసహితంబుగా మంగళద్రవ్యంబులు సంతరించుకొని నడువ నాకాశమా