పుట:హరవిలాసము.pdf/63

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64 హరవిలాసము

తే. ననుచు మొక్కించె ఋషులకు నందఱకును, నబ్జభవుకోడలికిఁ దుషారాద్రినాథుఁ
డవధరింపుఁడు శివునియర్ధాంగలక్ష్మి, ప్రణుతి యొనరించె మీ కని పల్కి నగుచు. 69

తే. ఈప్సితార్థక్రియాసముపేతుఁ డైన, శైలపతిమాట కందఱు సంతసిల్లి
ప్రణుతి యొనరించి యంజలిపాణి యైన, గౌరి నాశీర్వదించిరి గగనమునులు. 70

వ. అనంతరంబ యభిలషితవరసంప్రాప్తిసముపజాతకుతూహల యగునాహంసగమన నరుంధతి తనతొడలమీఁదఁ గూర్చుండఁబెట్టుకొనియె మునులును వినిశ్చితకార్యులై వివాహతిథి నేఁటికి నాలవనాఁ డని ముహూర్తనిశ్చయంబు సేసి సారుంధతీకులై హిమాచలంబు నామంత్రించి చని విశుద్ధం బైనకార్యార్థంబు విన్నవించి యమ్మహాదేవుం డనుప నిజస్థానంబుల కరిగిరి. పశుపతియు నెట్టకేలకు దివసత్రయంబు గడపుచుండె నట యోషధిప్రస్థపురంబునందు. 71

తే. ఓషధీనాథుఁ డభివృద్ధి నొందుచుండఁ, దిథికి జామిత్రగుణము సంధిల్లుచుండ
బర్వతేంద్రుండు సముపేతబాంధవుండు, పుత్రికోద్వాహకళ్యాణమునకుఁ దొడఁగె. 72

తే. నవశుభారంభసంవిధానముల నపుడు, కౌతుకవ్యగ్రకాంతానికాయ మగుచు
ననుపమస్ఫూర్తి సానుమంతునిపురంబు, సకలమును నొక్కయిలువోలె సంభ్రమించె. 73

సీ. సంతానకద్రుమచ్ఛాయాసమాకీర్ణ రాజవీథీపరివ్రాజితంబు
ధవళచీనాంశుకోత్తమసమాకల్పిత మహానీయతరకేతుమండనంబు
సమధికస్తంభకాంచనతోరణావళి మేళనోత్తేజితమిహిరదీప్తి
ప్రతిగృహద్వారపర్యంతసందానిత సుమగుచ్ఛమాలికాసుందరంబు
తే. గరుడగంధర్వకిన్నరఖచరయక్ష, సిద్ధవిద్యాధరాంగనాశ్రేణిభరిత
మఖిలలోకవిలోచనహర్షకరము, రాజితం బయ్యె నోషధిప్రస్థపురము. 74

వ. మైత్రీముహూర్తంబున నుత్తరిఫల్గునీనక్షత్రంబునకుం జంద్రయోగంబు గలుగుచుండఁ బతిపుత్రవంతు లగునమ్ముత్తైదువ లమ్మత్తకాశినికి శృంగారంబు సేసి రపుడు. 75

తే. గౌరసిద్ధార్థవినివేశకలిత మగుచుఁ, దరుణదూర్వాప్రవాళసంభరిత మగుచు
నాత్మరక్షాళిలీముఖం బగుచు నపుడు, బాల కభ్యంగనైపథ్యలీల యమరె. 76

క. బంగారుకంకపత్రముఁ, గెంగేల ధరించి యొప్పె గిరినందన య
భ్యంగముతఱి భాస్కరకర, సంగత యగువిదియనాఁటిశశికళవోలెన్. 77

సీ. కమనీయలోధ్రకల్కంబునలుంగున నభ్యంగతైలంబు నపనయించి
యాశ్యామ మైనకాలాగరుద్రవమున నంగరాగాలేప మాచరించి
కస్తూరి పునుఁగును గంధసారంబును సంపంగినూనెయు సంతరించి
యభిషేకవిధియోగ్య మగుమడుఁ గొల్లియ నిర్ణాభిబిలముగా నెఱికి గట్టి