16 హరవిలాసము
భీమాంబికామారనామాత్యనందను,
నఖిలపురాణవిద్యాప్రవీణు
నధ్వర్యు, వేదశాఖాధీతినిష్ణాతు,
నంధ్రభాషానైషధాబ్జభవుని,
తే. నుభయభాషాకవిత్వప్రయోగకుశలు,
బాలసఖు గారవించి, తాత్పర్య మొప్ప
నవచి త్రిపురాంతకుం డలకాధిరాజు
హితమతోక్తులు వెలయంగ నిట్టు లనియె. 8
క. కంటిని విశుద్ధసంతతి,
వింటిఁ బురాణములు పెక్కు, విశ్వము వొగడన్,
మంటి బహువత్సరంబులు,
గొంటి యశోధనము సుకవికోటులచేతన్. 9
సీ. కట్టించె నొకతాత కంచిహర్మ్యంబులు
హరిణాంకమౌళి కేకామ్రపతికి
బాలార్క మనియెడి పద్మరాగముఁ దాచె
నొకతాత కంచి నాయకుని నాభి
నొకతాత కట్టించె యోజనత్రయదీర్ఘ
తరతటాకాంబోధి తిరువళూరఁ
గావేరిఁ గట్టించెఁ గార్పాసరాసుల
నుబ్బి చోడఁడు మెచ్చ నొక్క తాత
తే. ప్రతిదినమ్మును గపురదీపములు వేయు
వ్రతముగా నొక్క తాత యీశ్వరున కొసఁగె
నిఖిలలోకప్రసిద్ధవాణిజ్యవంశ
ధరులు మా తాత లుభయగోత్రములయందు. 10
తే. శైవవైష్ణవసమయదీక్షావిశేష
ధన్యమానసు లుభయగోత్రములవారు
నాయభీష్టం బొకఁడు పిన్ననాఁట నుండి
పరమమాహేశ్వరాచారభక్తిపరత. 11
తే. ఆగమజ్ఞాననిధివి, తత్త్వార్ధఖనివి,
బహుపురాణజ్ఞుఁడవు, శుభభవ్యమతివి,
బాలసఖుఁడవు, శైవప్రబంధ మొకటి
యవధరింపుము నాపేర నంకితముగ. 12
వ. అనిన నేనును శుభముహూర్తమున నిజాంతరంగ మంగళాయత నాధిష్ఠిత కుమారాచల త్రిపురాంతకుం డవచి త్రిపురాంతకుండు కృతిస్వామిగా హరవిలాసం బను ప్రబంధంబు సెప్పం దొడంగి యమ్మహాప్రబంధముఖతిలకాయమానంబగు తదీయవంశం బభివర్ణించెద.
కృతిపతి వంశాభివర్ణనము
సీ. ముయ్యేడు వాసరంబు లకాలవర్షంబు
జడిపట్టి కురియఁ బర్జన్యుఁ బనిచి
తా నొక్కరుఁడు దక్కఁ దక్కొక్క శివయోగి
యూర లేకుండంగ మేర వెట్టి
కడవంగఁ బెట్టిన కొడుకు మాంసముతోడి
భోజనంబునకు విభూతి యొసఁగి
పుత్రుఁ బాకముఁ జేసి బోనము వెట్టినఁ
గుడువంగ నొల్లక పెడము వెట్టి
తే. వీరమాహేశ్వరాచారవీథియందు
నిజము గనిపించె నెవ్వాని నీలగళుఁడు
వాఁడు పాత్రుండు కాఁడె కైవారమునకు
దురితదూరుండు శ్రీ చిరుతొండనంబి. 14
సీ. అర్ధరాత్రంబున నల్లాడనాథుండు
దానె యెవ్వనికిఁ గైదండ యిచ్చెఁ
బదకంపుఁబచ్చను బై వేయవచ్చిన
దనుజారి నిల్పె నెవ్వని నిజంబు
అలిగి పోయిన వేంకటాచలంబున కేఁగి
కొనివచ్చె నెవ్వనిఁ గుధరధరుఁడు,
వైకుంఠనాథుఁ డెవ్వని సేవకును మెచ్చి
యాత్మసత్కారకల్యాణ మొసఁగె
తే. నతఁడు భాగవతోత్తముఁ, డతఁడు శుద్ధుఁ,
డతఁడు వైరాగ్యసంపన్నుఁ, డతఁడు ఘనుఁడు
పరమవైష్ణవసభ నుతింపంగఁ దగఁడె
కాంచినగరి కుటుంబి శ్రీ కంచినంబి.