పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/160

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వి తీ యా శ్వా స ము

123


     యూచముట్టుగ నాయొద్దనున్న సిరులు
     నాధ!' నీమ్రోల సర్వార్పణం బొనర్తు. 168
     
మ॥ రవిబింబ ధ్వజ మొప్ప నీ వనికిఁ జేరన్ నీకు మున్మున్నె యా
    రవికన్నన్ మునుదోఁచు నప్పొడుపుఁ దారన్ బోలె జృంభించి యా
    హవ రంగాభ్రముఁ జొచ్చి శాత్రవ కులధ్వంతంబుఁ జీల్తున్ బ్రతా
    ప విభుండన్న పిరంగి కీఘనుఁడయఃప్రస్ఫీత గోళంబనన్ 169
    
సీ॥ పారతంత్య్ర మదల్చి స్వాతంత్య్రమును నిల్పు
              బవరము వచ్చే సంవత్సరాది
    పండుగువోలె నీభారత ప్రజకెల్ల
              సమరాగమైన యుత్సాహ వేళ
    యందఱ మొక మొగంబై నిల్చి యరుల గె
              ల్చితిమేని స్వాతంత్య్రసిద్ధి యొదవు
    ననిలోనఁ బడినఁ గల్పాంతంబు వఱకు శా
              శ్వత నాకలోక వాసంబు గలుగు
              
గీ॥ రెంట నేది గల్గినఁ గృతకృత్యులగుదు
   మింత కన్నను జిరపుణ్య మేది గలదు
   మీన మేషంబులను బ్రొద్దుమించకుండ
   నిపుడె ప్రస్థానభేరి మ్రోయియింపవయ్య. 170
   
-: ప్రతాపసింహు నిర్ణయము నిబంధనములు :-

మ॥ అని గాంభీర్యము పూరుషాకృతిని దృశ్యంబౌచు నిందుండెనో
    యనఁ గూర్చున్నఁ బ్రతాపసింహుఁడు మహాత్మా! నీ కసాధ్యంబు గ
    ల్గునె యినాఁటి కిరాత వేషమునఁ జెల్వుంబోటి వెన్వెంట లే
    దను”టే కాని పురాకిరాతుఁడవు గావా శత్రుపూర్దాహకా!.171
    
గీ॥ త్యాగమూర్తులు వీరధర్మైక నిరతు
    లింద ఱుండఁగ జయసిద్ధికేమి కొఱఁత
    యాకసము వ్రాలుఁగాక చేయప్పళించి
    యాపఁ గలము విపత్కోటి నోపఁగలము.172 172