పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/147

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర


సీ॥ స్థానమా విశ్వవిశ్వంభరాదేవికి
              వజ్రభూషణము మేవాడసీమ
    యన్వయమా జగదారాధ్య దశదిశా
              వ్యాప్తకీర్తి యుతంబు భానుకులము
    పూర్వులా లోకైక పూజ్యు లిక్ష్వాకు హ
              రిశ్చంద్ర మాంధాతృ నృపతిమణులు
    ప్రజలా జగజ్జైత్ర పరిపూర్ణవిక్రమ
              ప్రాభవోద్దాము లా రాజపుత్రు
              
గీ॥ లాత్మలో క్షాత్రగుణ మణువంతయైనఁ
    గలుగువాఁడెవఁ డుఱక గాజులు ధరించి
    చల్లఁగా నింటఁ గూర్చుండ సాహసించుఁ
    దనదు సర్వస్వ మర్పింపఁ దలఁచుఁగాని. 117
    
సీ॥ క్ష్మాగోళమును ముంచు గాఢాంధతమసంబుఁ
              గర దివ్వెతో నార్పఁ గడఁగునట్టు
    లత్యగాధము సాగరానంతజలముల
              కేతమ్ము వేయ సూహించునట్లు
    వసుధ బొగ్గుగఁగాల్చు ప్రళయాగ్ని హోత్రంబు
              గన్నీటిచే నార్పనున్న యట్లు
    క్షయకాలమున రేఁగు సప్తమారుతధాటిఁ
              దేటి రెక్కల నార్పఁదివురునట్టు
              
గీ॥ లని జగము నన్నుఁ బరిహాసమాడుఁగాక
   యెక్కటిని నిల్చి బలమెల్ల నెదురువెట్టి
   విధికి మాఱొడ్డి స్వతంత్య్ర విజయలక్ష్మి
   యడుగులకు నిత్తుఁ ముత్యాల హారతులను. 118
   
గీ॥ ఎట్టి బ్రహ్మప్రయత్నంబునేనిఁ జేసి
    యుదయపురలక్ష్మికి గిరీటముంతుఁ దలను
    గాక దైవోపహతుఁడనై కడిమిచెడిన
    రక్తతతిఁ గూర్తు రతనాల రావిరేఁక. 119