పుట:భాస్కరరామాయణము.pdf/403

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

ఆకంపించె ధరిత్రి బి ట్టవిసిన ట్లై మ్రోసె బ్రహ్మాండ మ
స్తోకధ్వాంతము గప్పె దప్పిరి గతుల్ సోమార్కు లుల్కాదురా
లోకం బయ్యె నభంబు దిగ్వివరము ల్దూలెన్ యుగాంతాభ్రముల్
వే కూలెం బొడలేక భూతములు ఱోలెం గూలె నిర్ఘాతముల్.

221


వ.

ఆసమయంబున.

222

సముద్రుఁడు రామునకుఁ బ్రత్యక్ష మగుట

సీ.

అరుణసితాసితహరితవర్ణంబులఁ, జటులఘోరానలచ్ఛటలు దెగడ
[1]జిహ్వల నెగడెడుశిరములు గలమహా, ఫణులు ఫణామణిఘృణులతోడఁ
జుట్టును విలసిల్ల సురసరిన్ముఖనదుల్, తమతమదివ్యరూపములు దాల్చి
సూరెలఁ జెలువొంద సురుచిరబహుభూష, ణంబులు రక్తమాల్యాంబర ములు
మెఱయఁ గాంచననిభ మైన మేను పూని, సలిలమధ్యంబువలన నజ్జలధి వెడలి
యభయపుష్పమాలిక మౌళి నమర నానృ, పాలుపాలికి నేతెంచి కేలు మొగిచి.

223


చ.

నృపవర మున్ను లోకములు నిల్పినవాఁడవు నీవ కావె యా
దిపురుషుఁ డైనవిష్ణుఁడవు దేవహితం బొనరింప నిప్పు డీ
వపువు ధరించినాఁడవు భవన్మహిమంబున భూతకోటి ని
క్కపు[2]గతి నుండఁ గావుము జగం బెఱుఁగం గడసూప నేటికిన్.

224


క.

సగరుఁడు మీకులవిభుఁ డ, జ్జగతీపతి పేర నేను సాగర మనఁగా
నెగడుదుఁ గావున నిట్టులుఁ, దెగఁ దగునె నరేంద్రచంద్ర తెగ యుడుపఁగదే.

225


క.

నామీఁద నేమి వైచిన, నే మునుఁగఁగ నీక యెగయ నెత్తుచు రా మీ
రామార్గంబున రం డని, సామోక్తులు పలుక నద్దశరథాత్మజుఁడున్.

226


క.

కరుణం గనుఁగొని తటినీ, శ్వర విను నాబాణ మెచట వంధ్యము గా దీ
వరసాధన మే నిం కె, వ్వరిపై నడరింతు ననిన వారిధి మఱియున్.

227


క.

జననాథ [3]దృశ్యగుల్మం, బను పేరం బరఁగు నొకమహాగర్తము నా
కెనయఁగ నుత్తరభాగం, బున నుండు నగాధసలిలపూరం బగుచున్.

228


వ.

అం దాభీలముఖంబులు గలుగురాక్షసు లుండి దుర్వారగర్వంబునం బల్మఱుం
జనుదెంచి మదీయాంబుపూరంబు ననేకగ్రాహకులంబుతోడ బలువిడిఁ గ్రోలు
చుండుదు రాదురాత్ములసమ్మర్ధంబు నాకు సహింపరా కుండు నీ వీఘనకాండం
బింక నయ్యవటంబుపై నడరింతుగాక యనుడు నాదుర్ధరధనుర్ధరుం డట్ల చేసిన.

229


చ.

మిడుఁగుఱుమొత్తముల్ సెదర మింటఁ బొరింబొరి మంట లంట నె
క్కుడువడిఁ దచ్ఛరం బశనిఘోరగతిం బడి యన్నిశాచరుల్

  1. జిహ్వలు రెండువేల్ శరములు
  2. గతి నుండుఁ గాన తఱుఁగం బెరుఁగం గడచూప నేరికిన్.
  3. 'ద్రుమకుల్య' మని మూలము