ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రేకు: 9075-02 ---- సం: 04-579 వైష్ణవ భక్తి
పల్లవి:
నీ కథామృతము నా నిరత సేవన నాకు
చేకొనుట సకల సుఖ సేవనంబటుగాన
చ. 1:
ఇదియె మంత్రరాజము నాకు నేప్రొద్దు
నిదియె వేదసంహిత పాఠము
ఇదియె బహుశాస్త్రమెల్లఁ జదువుట నాకు
ఇదియె సంధ్య నాకిదియె జపమటు గాన
చ. 2:
ఇదియె బ్రహ్మవిద్యోపదేశము నాకు
ఇదియె దుఃఖవిరహితమార్గము
ఇదియె బహులోకహితభేషజము నాకు
ఇదియె వుపనిషద్వాక్యపద్ధతిగాన
చ. 3:
ఇదియె దానఫలమియ్యఁ జాలును నాకు
ఇదియె తపవిరహిత కర్మము
ఇదియె తిరువేంకటేశ్వరుని సంస్మరణ
ఇదియె యిదియె యిన్నియును నటుగాన