రేకు: 0368-01 గుజ్జరి సం: 04-399 శరణాగతి
పల్లవి:
ఇతరములన్నియునడుమంత్రములే యెంచిచూచినను యింతాను
హితవగుబందుగుఁ డీశ్వరుఁడొకఁడే యితని మరవకుమీ జీవాత్మా
చ. 1:
భవకూపంబుల బడలెడినాఁడు పాయనిబంధువుఁడితఁడొకఁడే
దివిస్వర్గంబునఁ దేలెడినాఁడు తిరుగఁబాయకెపు డితఁడొకఁడే
నవనరకంబుల నలఁగెడినాఁడు నటనలఁ బాయ డితఁడొకఁడే
యివలనవలహృదయేశుఁడు విష్ణుఁడుయీతనిమరవకుమీ జీవాత్మా
చ. 2:
పశుమృగాదుల వొడలెత్తినప్పుడు పాయనిబందుగుఁ డితఁడొకఁడే
విశదపు దుఃఖపువేళలనైనా విడువనిబంధువుఁ డితఁడొకఁడే
శిశువైనప్పుడు వృద్దైనప్పుడు చిత్తపుబందుగుఁ డితఁడొకఁడే
దశావతారపు విష్ణుఁడొకఁడే యితఁడని తలఁచుమీ జీవాత్మా
చ. 3:
భావజకేలినిఁ జొక్కినప్పుడును ప్రాణబంధువు డితఁడొకఁడే
యీవల నావల నిహపరములలో నిన్నిటిబంధువుఁ డితఁడొకఁడే
దైవము దానని శరణనియెడు నను దగ్గరికాచెను యితఁడొకఁడే
శ్రీవేంకటగిరి నాయకుఁ డితడే చేరి భజించుము జీవాత్మా
పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/400
ఈ పుట అచ్చుదిద్దబడ్డది