72 శ్రీ కాశీఖండము
భోగమోక్షములకు జన్మభూమి యైన
కాశి విడిచి నరుం డన్యదేశ మరుగు. 110
చ. తటగున నియ్యకొంటి మతి దప్పి మరుద్గురునంతవానితో
నటమట మింకఁ బోక యడియాసల నుండుటఁ బాపు దైవమా!
యిటు ననుఁ జిక్కు వెట్టుదె యనేకవిధంబుల నెట్లు చెప్పినన్
గటకట! యెట్లు వాయనగుఁ గాశిక మోక్షపదప్రకాశికన్. 111
సీ. పాయంగ వచ్చునే ప్రాలేయగిరికూట
సమవతీర్ణజలౌఘజహ్నుకన్య?
మఱువంగ వచ్చునే మందారమధురసా
స్వాదఘూర్ణితనేత్రు వటుకనాథు?
విడువంగ వచ్చునే విఘ్నాంధకారార్కు
డుంఠివిఘ్నేశు మండూకజఠరు?
మానంగ వచ్చునే మధ్యాహ్నకాలంబు
శ్రీవిశాలాక్షి కెంజేతిభిక్ష?
తే. సురలు ప్రార్థింపగాఁ బ్రతిశ్రుతము చేసి
యెట్టు వోకుండ నేర్తు నే నింతవాడ?
నెట్టు వో నేర్తుఁ గాశిఁ బుణ్యైకరాశి
బ్రకటగుణరత్నదుగ్ధాంబురాశిఁ బాసి. 112
క. కాశీ క్షేత్రము పంచ
క్రోశము గైవల్యలక్ష్మికులగృహ మని యా
క్రోశించు శ్రుతులు వినియును
దేశాంతర మరుగ సమ్మతింతు రభాగ్యుల్. 113
తే. కాశిం బాయుదుఁ గా కేమి కలువకంటి!
యంతరవిముక్తితీర్థంబు నాశ్రయింతు