పుట:కాశీఖండము.pdf/54

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

శ్రీరాజమహేంద్రవరమ
హారాజ్యశ్రీస్వయంవరాధీశ్వర! శృం
గారకళాఝషకేతన!
యారాధితభుజగహార! యల్లయవీరా! 1

దేవతలును మునులును బ్రహ్మకడ కేగి స్తుతించుట

వ. అక్కథకుండు శౌనకాదిమహామునుల కిట్లనియె. ఇవ్విధంబున నకాండప్రళయంబు సంభవించిన నపరాసురోరగం బగులోకంబు గాందిశీకం బగుటయు మునులును దేవతలును గూడి బ్రహ్మలోకంబునకుం బోయి బ్రహ్మ నిట్లని స్తుతియించిరి. 2

తే. బ్రహ్మ! బ్రహ్మస్వరూప! హిరణ్యగర్భ!
యమృత! కేవల! యప్రతర్క్యానుభావ!
వేదవేద్య! చిదాత్మ! యనాదినిధన!
చిత్తగింపుము సంస్తుతించెదము నిన్ను. 3

తే. డెందమును వాక్కు నెవ్వాని నందలేవు
కాంతు రెవ్వాని హృదయపుష్కరములందుఁ
బరమయోగీంద్రు లధికతాత్పర్యలీల
నట్టినీకు నమస్కార మఖిలవంద్య!