16 శ్రీకాశీఖండము
తే. తెలిసి దిక్పాలకాంశావతీర్ణుఁ డగుట
భోగమున శుద్ధసూనృతమున జయమున
నాజ్ఞ బలమున ధనమున నధికకరుణ
నల్లభూపాలనందనుఁ డన్నవిభుఁడు. 55
ఉ. వల్లకిచక్కికాహళము వంశము డక్కహుఁడుక్కఝర్ఝరుల్
ఝల్లరి యాదిగాఁ గలుగుశబ్దపరంపర తాళబద్ధమై
యుల్లసితప్రబంధముల కొప్పుగ నాడుదు రగ్రవేదిపైఁ
బల్లవపాణు లీశ్వరునిఁ బంటమహీశులు పూజసేయగన్. 56
శా. మార్కండేయ మహేశ్వరుం డఖిలసామ్రాజ్యంబు బాలింపఁగా
నర్కేందుల్గలయంతకాలము తదీయాంఘ్రిద్వయీభక్తిసం
పర్కోదంచితభాగ్యసంపదలనాక్ష్మామండలీవల్లభుల్
కోర్కు ల్నిండఁగ సేవకత్వమునఁ గైకొం డ్రాయురైశ్వర్యముల్. 57
సీ. ఉండు నేవీట మార్కండేయమునినాథ
సజ్జలింగ మనంగశాసనుండు
ప్రవహించు నేవీటిపశ్చిమప్రాకార
మొరసి గంగమ్మ సాగరముకొమ్మ
యావిర్భవించినాఁ డేవీటికోటలో
బలభేది మదనగోపాలమూర్తి
పాలించు నేవీటిప్రాగుదక్కోణంబు
సుమబోటి శ్రీముల్లగూరిశక్తి
తే. ప్రబలధారాసురత్రాణభద్రజాతి
కరిఘటాసైన్యదుస్సాధకనకలోహ
గోపురద్వారకవాటప్రదీపిత మది
సాంద్రవిభవంబు రాజమహేంద్రపురము. 58