పుట:కాశీఖండము.pdf/19

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6 శ్రీకాశీఖండము

తే. కలిగెఁ బదియాఱువన్నె బంగారమునకుఁ
బద్మరాగంబుతోడి సంపర్కలభ్ధి
కాశికాఖండమను మహాగ్రంథమునకు
నాయకుఁడు వీరభద్ర భూనాథుఁ డగుట! 17

వ. అని తన్మహాప్రబంధకల్పనాకుతూహలాయయత్తచిత్తుండ నై. 18

సీ. బాదరాయణుపాదపద్మంబులకు మ్రొక్కి
ప్రాచేతసుని మనఃపదవి నిలిపి
భట్టబాణమయూరభవభూతిశివభద్ర
కాళిదాసుల మహాకవులఁ గొలిచి
రాజశేఖరుని భారవి మాఘుఁ గీర్తించి
ప్రవరసేనుని దండి భాసుఁ దలఁచి
హర్షు బిల్హణుని మల్హణుఁ జోరుఁ గొనియాడి
క్షేమేంద్రు వేడుకఁ జిత్తగించి
తే. శబ్దశాసను నన్నపాచార్యుఁ దలఁచి
సత్కవిశ్రేష్ఠుఁ దిక్కయజ్వను భజించి
సత్ప్రబంధమహేశ్వరు శంభుదాసు
నధికసద్భక్తి సంయుక్తి నాదరించి. 19

తే. మత్పితామహుఁ గవిపితామహునిఁ దలఁతుఁ
గలితకావ్యకళాలాభుఁ గమలనాభుఁ
జంద్రచందనమందారసదృశకీర్తి
సరససాహిత్యసామ్రాజ్యచక్రవర్తి. 20

వ. అని యనంతరంబు కృతీశ్వరు వంశం బభివర్ణించెద. 21