శ్రీకాశీఖండము
పీఠిక
ఇష్టదేవతాప్రార్థనాదికము
శా. శ్రీకాశీనగరాధి రాజ్యపదవీసింహాసనాధ్యాసి లో
కైకగ్రామణి విశ్వనాథుఁడు విశాలాక్షీమనోభర్త సు
శ్లోకుం దొడ్డయయల్లభూవరతనూజున్ వీరభద్రేశ్వర
క్ష్మాకాంతుం జగనొబ్బగండని మహైశ్వర్యాన్వితుం జేయుతన్. 1
సీ. కంఠాగ్రకరిరాజు డుంఠివిఘ్నేశుండు
వడఁకుగుబ్బలికూఁతుకొడుకుకుఱ్ఱ
యాకాశమండలం బను నల్లకలువకు
నకరు వాద్యుండు లోలార్కమూర్తి
గోపాలరామలగుబ్బచన్ను లమెచ్చు
గీర్వాణవంద్యుండు కేశవుండు
కరటి వ్రీడాశూన్యకటి గోపురద్వార
పరిరక్షకుఁడు కాలభైరవుండు
తే. కాలకంఠునిశిరసుపూ గగనగంగ
కాశికాక్షేత్రమున కేడుగడయు నైన
యిందఱును నిత్తు రెల్లప్పు డీప్సితమ్ము
లల్లయప్రభు వీరభద్రాధిపునకు. 2
సీ. కబరికాభారంబు గై పెక్కు విరులతో
నవటు భాగంబుపై నత్తమిల్ల