పుట:కాశీఖండము.pdf/125

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

శ్రీకాశీఖండము


శా.

నానాశాస్త్రము లభ్యసింపను ననంతద్రవ్య మార్జింప సం
తానంబుం బడయంగఁ బుత్రులకు నర్థంబు ల్విభాగించి యీఁ
బౌనఃపున్యమునన్ సుఖం బనుభవింపంబోయెఁ గాలంబు గౌ
రీనాథున్ భజియింప నేన నయితిన్ శ్రీకాశికావల్లభుఁన్.

80


సీ.

కొలువంగ లేనైతి గోపాలకృష్ణుని
        నర్చింప లేనైతి హ స్తివదను
మ్రొక్కంగ లేనైతి మునిజనశ్రేణికి
        సేవింప లేనైతిఁ జిత్రభాను
యజియింప లేనైతి నమరసంఘాతంబు
        బూజింప లేనైతిఁ భూదివిదులఁ
గట్టింప లేనైతిఁ గమలకాసారంబు
        నిలుపంగ లేనైతిఁ దులసివనము


తే.

పేరటాండ్రను నర్చింపనేరనైతి
సలిలసత్రంబు సాగింపఁజాలనైతి
నాజ్యతిలహోమవిధులు మంత్రాన్వితముగ
హుతవహునియందుఁ జేయంగ నోపనైతి.

81


తే.

పురుషసూక్తము శ్రీసూక్తమును జపింపఁ
బావమాని పఠింపఁ దత్పరత మీఱ
నర్థి శతరుద్రియంబు పంచాక్షరంబు
ప్రణవమంత్రంబు జపియింపఁ బ్రతిదినంబు.

82


క.

ఈహర్మ్యము లీతురగము
లీహేమము లీభుజిష్య లీధాన్యము లీ
దేహము నాతో వచ్చునె?
యూహింపఁగఁ బుణ్యకర్మ మొక్కటి దక్కన్.

83