పుట:కాశీఖండము.pdf/110

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

97


తే.

బ్రహ్మసంవేద్య మాదిగాఁ బట్టె సొంత
మతివ! గోదావరీనదీహారమునకు
నడుమ నాయకరత్నమై నలుపు మిగులుఁ
బంచలింగాశ్రయము వీరభద్రశిఖరి.

33


వ.

అని చెప్పి యచ్చోట గదలి ప్రతిదినప్రయాణంబుల.

34


క.

క్షీరారామంబునఁ బ్రా
చ్యారామంబునను నాదిమారామమునం
దారాధిపచూడామణి
నారాధించెను మునీంద్రుఁ డతివయుఁ దానున్.

35


వ.

అనంతరంబ యమ్మునిసింహంబు సహ్యగిరికన్యకాప్రవాహంబునఁ గృతావగాహుం డయి కదలి పశ్చిమాంభోధితీరంబున సౌరాష్ట్రసోమనాథేశ్వరశరచ్చంద్రచంద్రికాధౌతకలధౌతసౌధవీథికాసముల్లిఖితగగనమండలం బయి పదునెనిమిదియోగపీఠంబులందును సుప్రసిద్ధం బైనకొల్లాపురంబునకుం జని యందు.

36


ఉ.

శ్వేతవరాహకల్పమున వెన్నుఁడు సూకరవేషధారియై
యాతతదంష్ట్రికాంకురమునందు ధరిత్రి వహించియుండఁగా
నాతనిమీఁద లేఁతపొలయల్క వహించి తొలంగి వచ్చెనో
యీతరలాక్షి? యండ్రు బుధు లెప్పుడు నాజగదేకమాతృకన్.

37


తే.

భద్రకాళికయై ఘోరపరశుధారఁ
గ్రూరదైత్యునిఁ బొరిగొన్న ఘోరమూర్తి
శౌరివక్షస్స్థలీనభశ్చంద్రరేఖ
శ్రీమహాలక్ష్మి భక్తి వీక్షించెఁ దపసి.

38