దశావతారచరిత్రము/9. బౌద్ధావతారకథ

9. బౌద్ధావతారకథ

నవమాశ్వాసము



లాలిత మగదలవం
శాలంకారాయితోదయ సమగ్రదయా
లీలాలవాల హృదయక్ష
మాలేఘశరణ్య కృష్ణమంత్రివరేణ్యా.

1


తే.

అవధరింపుము జనమేజయక్షితీశ, శేఖరున కిట్టులను వ్యాసశిష్యమౌని
బుద్ధకల్క్యావతారము ల్భూప యిఁకను, తెలియఁజెప్పెద వినుమని దెలుపఁదొడఁగె.

2


సీ.

శ్రీతారకబ్రహ్మసేవకుం డై భవతారకం డగువర్ధతారకాధి
పతిశిఖామణితనూభవునిచేఁ బరవీరతారకాభయదుఁడౌ తారకాసు
రుఁడు గూలఁ దత్కుమారులు తారకాక్షుండుఁ గమలాక్షుఁడును భుజాగర్వశాలి
యైన విద్యున్మాలి యనశనవ్రత మూని వేయేండ్లుతపము గావింప మెచ్చి


తే.

ధాత ప్రత్యక్షమై కామితములు వేఁడుఁ, డనిన దైత్యు లమర్త్యత్వ మభిలషింప
వలదు వేఱొకకోరికెఁ దెలుపుఁ డనిన, బ్రహ్మఁ గనుఁగొని వారలు పలికి రిట్లు.

3


తే.

అబ్జసంభవ స్వైరవిహారయోగ్య, మమర గంధర్వసిద్ధసాధ్యాదినిఖిల
శాత్రవాసాధ్యమైన పురత్రయంబు, మాకు దయసేయు మనిన నాలోకవిభుఁడు.

4


క.

మయునిం బిలిపించి పుర, త్రయము న్నిర్మింవు మీవు తాదృశమహిమన్
దయసేసెదఁ బురముల కని, ప్రియమున నజుఁ డనియె దనువుబిడ్డలతోడన్.

5


ఆ.

ఎన్నఁడైన నేమి యీపురత్రితయంబు, నొక్కదిక్కుఁ జేరు నొద్ది కగుచు
నాఁడు బలియుచేత నాశమౌ నందాఁక, సమయ దనుచు నజుఁడు సనియె దివికి.

6


సీ.

శతయోజనాయుతపాలసౌధాగారశృంగారవనికావిచిత్రములుగఁ
జిన్నంబుచే వెండిచే నుక్కుచేతను ద్రిపురము ల్మయుఁడు నిర్మించి యొసఁగె
హేమపురంబున కేలికయై తారకాక్షుండు త్రిదశాలయంబునందు
రాజితమగు నగరంబున కొడయుఁడై కమలాక్షుఁ డంతరిక్షంబునందు


ఆ.

నాయసపురి కీశుఁ డగుచు విద్యున్మాలి, యుర్వియందు మెలఁగుచుండి రష్ట
దిగధిపాలముఖ్యదేవతాజయ్యులై, సకలభోగభాగ్యసహితు లగుచు.

7

సీ.

వ్రాలునింద్రాదిదిక్పాలవల్లభుల పట్టణములు నేలమట్టములు గాఁగఁ
బఱచు హేమనగాదిపర్వతరాజశృంగంబులు ఛిన్నభిన్నంబులుగను
నెగయు భానుశశాంకనిఖిలగ్రహము లూడిపడఁగ బ్రహ్మాండకర్పరము దాఁకఁ
దూఱువారాసులు దుర్వారతరసప్తపాతాళవాసులు పగిలిపాఱఁ


తే.

దిరుగు బహుచిత్రగతుల నంబరమునందు, నిజగతాగత మెఱుఁగక నిబ్బరముగ
నొరసి దేవవిమానము లుర్విఁ గూలఁ, బ్రశమితజగత్త్రయంబు పురత్రయంబు.

8


సీ.

అని చేసి పొడిసేతు మని యెందు వెదకుచు పురములు గానక తిరుగుటకును
బరికించి చొరలేక పై వైచి వజ్రాదిబహుశస్త్రములు మొక్కపఱుచుటకును
బాలెంబుడిగి యున్నపట్ల నెందేనొక్కపురి గుప్పుమని కూలఁ బొలియుటకును
గైలాసమందరకనకాద్రిముఖ్యభూధరకందరములందు దాఁగుటకును


తే.

నెందు బెడబెడమనిన మహీధరంబు, విఱిగి పైఁబడునంచును వెఱచుటకును
గానిదైత్యాధిపతులతోఁ గలసి మెలసి, యాహవము సేయఁజాల రింద్రాదిసురులు.

9


క.

పురదైత్యపరాజితులై, హరిహయముఖదివిజు లజునిఁ బ్రార్థింప వచో
వరుఁ డాయమరులతోఁ జని, హరు వేఁడిన నతఁడు శౌరి నడుగుదమనుచున్.

10


మ.

నెలపూఁదాలుపు గిబ్బ నెక్కి వెడలన్ వెన్వంట నచ్చంపుఱె
క్కలతేజీ నడిపించెఁ బద్మజుండు మున్గాకుండ దట్టించుచున్
వలచే వాగెబిగించి హస్తిడిగి యశ్వం బెక్కి కూడెన్ విశృం
ఖలుఁడై వాసవుఁ డన్యనిర్జరులు వెన్కంబోయి రంతంతటన్.

11


క.

అప్పుడు గలశాంభోనిధి, చప్పుడు పెదవిన్నపములు సాగింపంగా
నప్పలుకుచెలువచెలువుఁడు, విప్పుం గనుదొరలతోడ వేడుక ననియెన్.

12


మ.

చెలువారంగఁ దరంగహస్తముల రాజీవాయతాభీలచం
చలవాతాహతధూతశీతలవృషత్సంఘాతముక్తాళిచేఁ
గలశాంభోనిధిసార్వభౌముఁడు వియద్గంగాలతాతన్విపైఁ
దలఁబ్రా ల్వోయుతెఱంగు గంటిరె శుభోదర్కంబుగా నీయెడన్.

13


క.

కలశాంభోధి మథింపఁగఁ, గలిగినయమృతంబు మీరు గైకొని వెన్నన్
నలినాక్షునిపా లిడినటు, వలెనున్నది తెల్లదీవి వైఖరి నిచటన్.

14


క.

సమ్మద మెసఁగం గంటిరె, తుమ్మెదగల మావిపంటితులదూఁగుచు నీ
క్రొమ్మొగులుడాలువేలుపు, కమ్మనికుందనపుమేడఁ గడుచోద్యంబై.

15


వ.

అని యకుంఠితమహిమాకరంబగు వైకుంఠపురంబు వాణీకలకంఠకంఠికామనో
హరుండు వర్ణింప సముత్కంఠ వినుచు నీలకంఠాది విబుధకంఠీరవు లుపకంఠ
నిరవకుంఠనముక్తాతోరణఘృణిశుంఠితశతసహస్రగురువరారోహాజారం బగు
హరిహజారంబుఁ బ్రవేశించి ధగద్ధగితమణిమయచతురకక్ష్యాంతరంబులు గడచి

యవల వలమానజనంబులవలన లలనాసమేతుండై శృంగారవనంబున కరుగుట
విని యద్దేవునిరాకకై యుద్యానవనవాటికాద్వారంబునఁ గైరవాప్తుం దృణీక
రించు నిగనిగని మగఱాల వెన్నెలగనియగు తిన్నెలు గని వసియింప నెంచు
నవసరంబున.

16


తే.

చెలువ యొక్కతె వచ్చె నాచెలువఁ జూచి, కమలయంచును భ్రమసిరి యమరు లెల్లఁ
గనకవేత్రంబుఁ గని దాదిగాఁ దలంచి, యుండి రాఖండలాదు లయ్యువిద యంత.

17


క.

హరుని వచోయువతిమనో, హరునిఁ బులోమాసురేంద్రహరునిన్ గురునిన్
హరి రమ్మనియె నటన్నన్, హరుసముతో వారు నలువు రతివినయమునన్.

18


మ.

చని వీక్షించిరి భూమి నీళ మొదలౌ చంద్రాస్య లంతఃపురం
బున కేఁగం గమలాలతాంగి యెదపైఁ బొల్పొందు మాల్యంబుచా
టుననిల్వన్ ఫణిరాజపీఠమున నీటుల్గుల్కఁ గొల్వై ఖగేం
ద్రునిచేత న్మడుపందు మందరధరున్ లోకైకరక్షామణిన్.

19


క.

కని మ్రొక్కినఁ గనికరమునఁ, గని కరమున లేవనెత్తి కఱుకంఠుం జెం
త నుచితపీఠి వసింపం, బనిచె నిలుచుండి రెదుట బ్రహ్మేంద్రగురుల్.

20


తే.

చంక చేతులు వెట్టుక సవినయముగఁ, గెలన నిలుచున్నవారి నీక్షించి శౌరి
మీరు గూర్చుండుఁడని పలుమాఱుఁ బలుక, నుచితవైఖరి వారుఁ గూర్చుండి రంత.

21


క.

ఏమీ వచ్చిన కార్యము, కామారి యటన్న ముకుళకరకమలుండై
స్వామి యెఱుంగనికార్యము, లేమున్నవి త్రిపురదైత్యు లెచ్చి రటన్నన్.

22


శా.

స్నానంబున్ జపముం దపంబు గ్రతువు ల్స్వాధ్యాయము ల్దేవతా
ధ్యానంబున్ మొదలౌ ధరిత్రి గలశ్రుత్యాచారము ల్దప్పి రిం
తైనన్ దానన చేసి దానవు లజయ్యత్వంబున న్మించి ర
ట్లైనన్ సత్యము శౌచమున్ దయయు లే వావంతయున్ శంకరా.

23


సీ.

చంద్రశాలలయందు సంపూర్ణ చంద్రుని గన్నులకింపుగాఁ గాంచుటకును
వైడూర్యమయసౌధవాతాయనంబుల సూర్యకరాళి మై సోఁకుటకును
సురతాంతతాంతలై సురపొన్న వీచిన సురభిమారుతములఁ జొక్కుటకును
శీతకాలంబుల శ్రీచందనహసంతికాహుతాశను సెగఁ గాంచుటకును


తే.

భయపడుదు రన్నఁ గలనైనఁ బరులఁ దలఁప, రనుట సువ్యక్తమగుఁ గదా యసురవరుల
కట్టిపరమపతివ్రత లాండ్రు గాఁగ, నెట్లు వారల గెలువనౌ నెవరికైన.

24


తే.

అదియునుం గాక యలతారకాక్షసుతుఁడు, హరవిరించులగుఱిచి యత్యద్భుతముగఁ

దపము గావించి స్వపురమధ్యమున నొక్క, యమృతకూపంబు వడసె నీయజునికరుణ.

25


క.

అది కారణముగ దైత్యులు, త్రిదశులతో వెఱవ కెదిరి తెగినదనుజులన్
బ్రతుకంజేయుదు రొకనిం, బదుగురిఁగా నజువరప్రభావమువలనన్.

26


తే.

అయిన నేమాయె నిప్పు డాయమృతరసము, సంగ్రహింప నిశాచరాచార మడఁపఁ
బురపురంధ్రీపతివ్రతాచరిత ముడుపఁ, గడ నిశాటుల గెడప నేఁ గంటి నుపమ.

27


క.

అని యోజన దెలిపి కప, ర్దిని బలమర్దిని సురేజ్యు దివిజగణంబుం
బనిచి యజు దూడఁ గమ్మని, వనజాక్షుఁడు ధేనువై యవారితశక్తిన్.

28


తే.

ఖచరకిన్నరగంధర్వగరుడసిద్ధ, సాధ్యవిద్యాధరాదినిర్జరవితాన
దుర్గమంబైన దానవేంద్రునిపురం బు, పాయమునఁ జొచ్చి యటమట మాయ మొదవు.

29


సీ.

రాణించుచును బచ్చఱా చెక్కడపునేల మెఱుఁగుపచ్చికలంచు మేయు సొబగు
నర్భకు ల్దనదూడ నదలింప హుమ్మని వలుదకొమ్ములఁ గ్రుమ్మవచ్చు కినుక
చేఁపినపొదుగు వర్షించుదుగ్ధంబులు నించి వెల్లువలు గట్టించువింత
యొద్దిక మీఱంగ నొక్కెడ వసియించి యెడనెడ నెమరు వెట్టెడివిధంబు


తే.

గాంచి యెక్కడనుండి యిక్కడికి వచ్చె, నొక్కొ [1]యీయావు దూడయుఁ జక్క ననుచు
నసురు లచ్చెరువంద నందంద మెలఁగి, బ్రమయఁ జేయుచు నమృతకూపమునఁ దుమికె.

30


వ.

అప్పుడు.

31


ఆ.

ఆవు బావిఁ బడియె నయ్యయో కాలుఁగీ, లేమి యయ్యెనొక్కొ యెట్టు లనుచు
నగచి దైత్యులెల్ల డిగి యెత్తఁ జని యందు, ధేను వమృతరసముఁ గానలేక.

32


క.

ఆవిటుల నేర్చునే మా, యావియ యిది యనుచుఁ దారకాక్షాసురుతో
నావింత దెలుప దనుజుల, లావింతట నణఁగెనని ప్రలాపాన్వితుఁడై.

33


క.

శోకించు తారకాక్షుని, వ్యాకులభావంబు తత్త్వవైఖరి వెలయన్
లోకోక్తులు దెలుపుచును ని, రాకృతి గావించె మయమహాయోగి యటన్.

34


మ.

కరపద్మంబున బర్హిబర్హము వొసంగం జూళికాహీనమై
శిరమున్ బంగరుబొంగరంబువలె రాజిల్లం గటీలోహితాం
బర మొప్పాఱఁగ నుజ్జ్వలప్రభ దలిర్పన్ వార్ధికన్యామనో
హరుఁ డాదైత్యులఁ జేరఁగాఁ జనియె బౌద్ధాకార మేపాఱఁగన్.

35

సీ.

మణిమయకోటీరమండితం బగునుత్తమాంగంబు ముండితం బైనదేమి
కనకాంబరంబులు గట్టనర్హంబైన కటి కావికోకలు గట్టనేమి
యాయుధోచితమైన హసప్తద్మంబున బట్టి బర్హంబును బట్టుటేమి
జగము నేలంగఁ దేజంబు గల్గియు నిట్టి సన్న్యాస మవధరించంగనేమి


తే.

యహహ సన్న్యాసిగాఁడు సన్న్యాసియైన, దండముఁ గమండలువు నెద్ది ధరణి నెన్నఁ
డిట్టివేషంబు గనుఁగొన మెవ్వఁడొక్కొ, యీమహామహుఁడంచు దైత్యేంద్రు లపుడు.

36


తే.

తనకు మ్రొక్కిన కుశలమౌ దనుజులార, యనిన వేదోచితాచారమున మెలంగు
మాకుఁ గీడేలగల్గు సేమంబెకాక, యనినఁ బకపక నగి బుద్ధుఁ డనియె నపుడు.

37


క.

ప్రస్తుతియోగ్యమె శ్రుతివ్య, త్యస్తము పునరుక్తవాక్య మనృతోదితవి
ధ్వస్తము మఱివ్యాఘాత, గ్రస్తం బది నిజము సేయఁగా నేమిటికిన్.

38


క.

[2]“యజమానప్రస్తర” యను, నిజమా యామాట యదియ నిక్కంబైనన్
"యజ తే” యనువాక్యంబును, నిజమని నమ్ముదుము శ్రుతికి నిజముం గలదే.

39


క.

కనుఁగొన శ్రుతి యేమెఱుఁగును, దనుజాధిపులార “కోహితద్వేద” యటం
చనునే యది యెఱిఁగినచో, మన కేటికి నట్టి శ్రుతిఁ బ్రమాణము సేయన్.

40


క.

మన మెఱుఁగమె యేటికిఁ జె, ప్పెను శ్రుతి “యగ్ని ర్హిమస్య భేషజ" మనుచున్
మన మెఱిఁగిన మాత్రమె యది, యు నెఱుంగఁగనుండు యుక్తియుక్తము గాఁగన్.

41


సీ.

కర్మంబు ఫలదాత గా దీశ్వరుండంచు ద్వివిధమై మీమాంస విఫలమయ్యె
నొక్కజీవుఁడటంచుఁ బెక్కు జీవులటంచు వేదాంతశాస్త్రంబు వితథమయ్యె
హరి యెక్కుఁడంచును హరుఁ డెక్కుఁడంచును బహుపురాణంబులు పాటిదప్పె
నైకవిధ్యంబు లేదరయఁగా స్మృతుల నేతెఱఁగునఁ దీసినఁ దీయవచ్చు


తే.

దానము లొసంగి ద్విజుల నుదగ్రనరక, కూపములఁ ద్రోయుదురె మేలు గోరి తమకు
బుద్ధిహీనులు ప్రతిమలఁ బూజ సేతు, రనఁగ నెందును వినరె ప్రజ్ఞాధ్యులార.

42


సీ.

అకలంకులార యింకొకకర్మఠుల యవివేకంబు వినుఁ డతివిస్మయంబు
గర్మంబువలన వైకల్యంబు గలదటుఁ గలుగఁ బ్రాయశ్చిత్తకలనమునను
బోనఁట పాచితంబునను వైకల్యంబు బొరయఁ బోనఁట హరిస్మరణమునను
అదియె నిశ్చయమైన నాస్మరణము మున్నె సేయరాదే యేమి సెల్లెఁ దమకు


తే.

నేర్పుతోఁ గొంగనెత్తిని నెయ్యి పెట్టి, కరఁగి కన్నుల నిండినఁ గానకుండఁ
బట్టికొనవచ్చునను మతిభ్రష్టు గలఁడె, కలఁడె యననేల తాదృశు ల్కర్మరతులు.

43

సీ.

స్నానంబువలన మోక్షంబు గల్గిన నీరుకాకికి మోక్షంబు గలుగవలదె
కాకధ్యానమున మోక్షము గల్గినను దటాకము బకంబులకును గలుగవలదె
ముక్తి ప్రదక్షిణంబులఁ గల్గునన్నను కాకి గ్రద్దలకును గలుగవలదె
పుడమిఁ బశ్వాలంబమున స్వర్గమన్నను బలలభుక్కులకెల్లఁ గలుగవలదె


తే.

కాననస్థితి బోయకుఁ గల్గవలదె, బిలములందున్నఁ గలదె గబ్బిలములకును
గానయందున్న మోక్షంబు గానరాదు, క్షణికవిజ్ఞానముననె మోక్షంబు గలుగు.

44


సీ.

ఎక్కడివేదంబు లేడయాచారంబు లీవట్టిభ్రమలు మీ కేల పుట్టె
నవి యెల్లఁ గల్ల లెట్లనిన “గ్రావాణః ప్లవంతే” యనవె ఱాయి వారిఁ దేలు
నేనిర్ణ యం బెద్ది యిదిగో "ననుదితేజుహోతి" యం"చుదితేజుహోతి" యనుచుఁ
గ్రతుపశువునకు స్వర్గస్థితి గలదఁట యటులైన యజమానుఁ డాత్మజునకుఁ


తే.

బశువుఁ గావించి దివి నుండఁ బనుపరాదె, చెల్లఁబో నో రెఱుంగని జీవములను
గూయగాఁ బట్టుకొని గొంతు కోయవలెనె, తినమరిఁగి సేయుదురు గాక దనుజులార.

45


క.

ధరలో వినరే "యహింసా, పరమోధర్మ" యనియంచుఁ బ్రాణివధను జే
తురె యకట యజ్ఞవిధియని, యరయఁగ నది యజ్ఞవిధియె యగుఁ జింతింపన్.

46


క.

ఏతఱి విధియంచుం బశు, ఘాతమె మంత్రోక్తి నిదియొకటి సత్యమె యా
రీతి “నహింసా త్సర్వా, న్భూతాని” యటంచు నుడువుఁ బో శ్రుతి యహహా.

47


క.

తల పేనైనను జంపక, నలిచి విడువవలయుఁ ద్రోవ నడుచునపుడు చీ
మలనైనఁ ద్రొక్కకయె సోవలయు హెచ్చరకె జంతువధ కొఱగామిన్.

48


క.

సమిదాజ్యపశులు శిఖ భస్మములై ఫల మొసఁగెనేని మరుధర నిడుబీ
జములు ఫలింపవె యేటికి, భ్రమ క్షణకర్మములు భావిఫలదము లగునే.

49


సీ.

అంధున కొదవునే గంధేభగామినీలోకశృంగారావలోకనంబు
బధిరున కబ్బునే మధురాధరాధరాకథితనర్మోదితాకర్ణనంబు
నిర్దంతునకుఁ జేరునే నీరజాననారదనఛదాచ్ఛిదారంజనంబు
కడునపుంసకునకుఁ గల్గునే కలకంఠకంఠికారతికేళికాసుఖంబు


తే.

కర్మఫలసాధనములు భంగంబు లొందఁ, గర్మఫల మెట్లు సిద్ధించుఁ గనరుగాక
ఘటము ఘటియింపఁ దగు మృత్తికను జలంబు, లోనఁ గలసిన ఘటముగాఁ బూను టెట్లు.

50


శా.

రంభాభోగముఁ గోరి యాగముల కర్థంబెల్ల వెచ్చించు టా
యంభోదంబులఁ జూచి చెర్వుజల మాద్యంతంబుఁ జల్లించుట

ల్సంభోగేచ్ఛ జనించెనేని మఱి వేశ్యారత్నము ల్లేరొకో
సంభోగింపఁగరాదె కానరు జడుల్ జ్ఞానంబు సామాన్యమే.

51


క.

వినుఁ డొకటి బావమఱఁదులు, జనకకుమారకులు మఖము సల్పిన రంభా
వనితం గలయుదు రటులై, నను లేవే వావివర్తనలు యజ్వలకున్.

52


మ.

వికటం బింతియెకాక తృప్తియగునే వేయైన శ్రాద్ధంబుచే
నకటా ప్రేతల కట్టులైన మఱి యేలా యూరికిం జద్దిగ
ట్టుకపోఁగాఁ దనపేరు సెప్పికొని యింట్లోవారె బోసేయుమం
చొకమాటాడి చనంగరాదె తన బాహు ల్నొవ్వ మోపేటికిన్.

53


తే.

కాక పితరులు కూటికిఁ గాతురనినఁ, దెలియదే యందున్న పుణ్యకలుషఫలము
లనుభవింపమి మరలి యీయవనియందు, జనన మొందమి శేముషీసాంద్రులార.

54


శా.

లోలంబై జలరాశిలోఁ బొడము కల్లోలంబు వేలాహతిం
దూలన్ వేఱొకవీచి వచ్చుగతి జంతుశ్రేణిలో నొక్కఁ డా
చాళింగూలినఁ బుట్టునొక్కఁడు పునర్జన్మంబు లేదెన్నఁడుం
జాలుం బుణ్యము దుష్కృతంబనుచు దుశ్శంకం బ్రవరిల్లుటల్.

55


సీ.

సురఁ ద్రావుచుండు మీగురుఁడు భార్గవమౌనిపాలుఁ డేనరకకూపమున మునిఁగెఁ
జలపట్టియధ్వరాశ్వముల దొంగిలిపోవు వాసవుం డేరౌరవమునఁ గూలె
నేకర్మములు లేక యిచ్చగా విహరించు సనకాదు లెట్టియాతనలఁ బడిరి
బలవంతమున గురుకులకాంతఁ బట్టినవనజారి యేదోష మనుభవించె


తే.

బళి వారికి లేనిపాపములు మనకె, గలిగెనే తనయుక్తిని గద యటన్నఁ
గాయ మెడలిన మోక్షంబుగాక మఱి శ, రీర మేడది సుకృతదుష్కృతము లేవి.

56


క.

స త్తైనదెల్ల క్షణికము, నిత్యము గాదంచు వాహనివహమువలెనే
చిత్తైన జీవుఁడటువలె, సతైతె క్షణికుండు గాక శాశ్వితుఁ డగునే.

57


క.

ఎటువలె నున్నది పట మిది, ఘట మిది యనుచోటఁ బటిని గలజ్ఞానం బా
ఘటిలేదు ఘటజ్ఞానము, పటిలేదటు గానఁ గనుఁడు ప్రత్యేకముగన్.

58


తే.

అఖిలభోగానుభవయోగ్య మైనతనువు, పడసియును జపతపములపాలు సేసి
సౌఖ్య మొందక చెడుమూర్ఖజనులఁ దెల్పఁ, బూటయేమాకు వా రట్టె పోవనిమ్ము.

59


క.

మొదటికి నిహమే లేదట, పిదపం బర మెటులు గల్గు బేలుఁదనము గా
కిది మతము గాదు నామత, మిది గైకొనుఁ డిహపరంబు లిచటనె కల్గున్.

60


తే.

అప్పు గొనియైన దొంగిలియైన లెస్స, జిహ్వ కింపైనదాని భుజింపవలయుఁ
గంటి కింపైనకాంతలఁ గలయవలయు, బ్రదుకుదినముల మోక్షంబు వెదకనేల.

61


తే.

క్షితిని సర్వజ్ఞుఁ డన మారజి త్తనంగ, నేనె తన్నామములు సెల్లె నీశ్వరునకు
నతని కివి చెల్లుననిన మాయాముకుందు, నెఱుఁగ కేటికి వలచె దైత్యేంద్రులార.

62

వ.

అని ప్రత్యక్షానుమానప్రమాణోత్తరంబు లగు హేతువాదంబులు బుధుండు
బోధించిన సిద్ధం బని నమ్మి వేదంబు లర్థవాదంబు లనువారును యజ్ఞవిధు లజ్ఞ
విధులనువారును శాస్త్రార్థంబు లపార్థంబు లనువారును నై బహుకాలంబు చారు
తరవేదాచారు లగుత్రిపురనిశాచరులు శీఘ్రంబున సత్ప్రచారులు యథేచ్ఛాసం
చారులు నైనవారివిధంబు చారులవలన విని యింద్రాదిగగనచారులు గతవి
చారులై యుండి రంత.

63


శా.

శ్రీమద్బుద్ధమునీంద్రుఁ డంతిపురి గౌరీపూజ గావించు సు
త్రామారాతికులాంగనామణులఁ జేరంబోయి తద్రూపురే
ఖామాహాత్మ్యము మానసంబు గలఁపం గందర్పదర్పోదిత
వ్యామోహం బతివేలమై నిగుడఁగా వారి న్నిరీక్షించుచోన్.

64


క.

పరపురుషుఁ డెవ్వఁడో యిట, కరుదెంచె నటంచు దానవాంగన లవనీ
ధరకన్యగర్భగృహమున, కరగి రపుడు దాది నిలిచి యమ్ముని కనియెన్.

65


తే.

అరసిచూడఁ ద్రిమూర్తులయందు నొకడ, వింతయే కాని యన్యుల కిట్టిదివ్య
తేజ మొడఁగూడనేరదు దేవదేవ, తెలుపుఁడన బోడిదేవర తెలిపె నపుడు.

66


క.

బుద్ధుఁడ నను గొలిచిన భవ, బద్ధులు రక్షింతు నిహము పర మొసఁ గిచటన్
సిద్ధముగా నావచన మ, బద్ధముగా దనిన దాది పర్వునఁ జనుచున్.

67


క.

ఈవేళ మ్రొక్కఁబోయిన, దేవర యెదురయ్యె బుద్ధదేవర మనకున్
గావలసిన వర మీయఁగ, దా వచ్చినవాఁడు రండు తామరసాక్షుల్.

68


క.

అని దాది పలుక దేవుం, డనుభక్తిని సతులు వచ్చి యంఘ్రుల కెఱఁగం
దనువు పులకింప ముని లె, మ్మని వనితల నెత్తి యిట్టు లనియెం బ్రీతిన్.

69


ఉ.

హృద్యము గాదు మీర లిట నీశ్వరియంచును ధూపదీపనై
వేద్యము లిచ్చి ఱాప్రతిమ వేయువిధంబులఁ బూజ సేయుట
ల్చోద్యము గాక యేఫలము సూపెడి ఱాళ్ళకు నీళ్లు పోసినన్
వేద్యము లాఫలార్థులకు వృక్షము లుండఁగ నీవృథాశిలల్.

70


తే.

రాజముఖులార శుక్రవారమున బాహ్య, జలముల మునింగి బత్తిబిత్తలియె రావి
కౌఁగిలించిన మీకెల్ల కార్యసిద్ధి, గలుగు నామాట సత్యము కల్ల గాదు.

71


మ.

అనినన్ మంచిదె యంచు లేనగవుతో నబ్జాక్షు లంతఃపురం
బున కేగంగఁ దదంగసంగతమనోబుధ్యాదియై మారుమో
హనబాణంబులు సోఁకి మ్రాన్పడి నాయశ్వత్థమై బుద్ధుఁ డా
వనమధ్యంబున నుండె లౌల్యము దళవ్యాజంబునం దెల్పుచున్.

72


తే.

చంద్రసూర్యమరుత్తులు సంచరింప, నళికి కడకడత్రోవల నరుగుచున్న
ప్రమదవనమున కొకనాఁడు ప్రమద మమర, నమరపరిపంధివల్లభప్రమద లరిగి.

73

ఉ.

పొన్నలు పోఁకమ్రాకులును బూచినసంపెఁగలున్ మధూకము
ల్తిన్ననినారికేళములు తియ్యనిద్రాక్షలు గుజ్జుమావులుం
గన్నులగోరగించు జగిగల్గిన మోదుగులున్ వనంబులో
నన్నియుఁ జూచి కాంచి చెలు లచ్చట నచ్చటఁ బూలు గోయుచున్.

74


క.

పదిరెండేడులపాయపు, సుదతీమణి యవయవములు సొబగుదలిర్పన్
గుదిగొనఁ జిగిర్చి తమక, ట్టెదుటం గనుపట్టురావు లీక్షించి సతుల్.

75


క.

బుద్ధముని చెప్పినటువలె, బద్ధాదరచిత్తవృత్తి పాటించి తమిన్
సిద్ధంబుగ మనకోరీకి, సిద్ధించు నటంచుఁ గొలను సేరి పురంధ్రుల్.

76


సీ.

కురువేరు మొగలిరేకులు పెట్టి యల్లినజడ విప్పి కీల్గొప్పు సవధరించి
బిగిచన్నుఁగవ గుత్తమగుముత్తియవుజంటఱవికె సడల్చి హారములు దివిచి
తళుకులేఁజెక్కుటద్దముల విద్దెముచూపు కట్టాణికమ్మలు కదియ నదిమి
చిలుక బవంతిచీరెలు గట్టుపై నుంచి బెడఁగు చెంగావిపావడలు విడిచి


తే.

మారుఁ డొఱఁదీయ మెరయుకటారు లనఁగ, సోఁకుమూఁకమిటారులు సోలిగాఁగఁ
గొదమరాయంచబారుల యుదుటు దెగడి, కొలను సొచ్చి విహారము ల్సలుపునపుడు.

77


సీ.

పెంటిఁ గానఁగలేక బిస్సున వలిగుబ్బచంట వ్రాలెడు చక్రవాకమునకుఁ
తల్లిఁ గానఁగలేక తళుకుబిత్తరితేఁటి వాలుఁగన్నుల వ్రాలు వాలుగకును
గొదమలఁ గానక గుమికూడి యలకభాగమ్ములఁ గ్రుమ్ము భృంగంబునకును
దోడియంచలఁ బాసి తొగరాకుటడుగులఁ బెనఁగెడు రాయంచపిలుకలకును


తే.

బెళికి తప్పించుకొనుచు బిట్టులికిపఱచు, కలికి నవ్వుదు రావె యీవలికి నీవు
వలికి వెఱచిన నని కేరి పలికికొనుచు, వెలఁదిమిన్నలు నీరాడి వెడలునపుడు.

78


తే.

వారి వీక్షించి యామునవారి వెడలి, గోపవారిజనేత్రలు కోక లడుగ
వచ్చునాఁటి విలాసంబు మెచ్చుకొనుచు, నుల్లమున నెన్నెఁ జెట్టున నున్న శౌరి.

79


సీ.

అపుడె వెన్నాడు దుర్యశమన నంసభాగమునఁ గన్పట్టు కీల్గంటుతోడఁ
బదిలమైయుండుము హృదయమా యనురీతిఁ జనుఁగవగదియు హస్తంబుతోడ
నిది దాఁచుకొన్నఁ దా నేమి సేయునటన్న కరణి నందుంచిన కరముతోడ
నభిమానములు ప్రోవుమని నమస్కృతి సేయు గతిమించు నానతాంగంబుతోడ


తే.

బెళుకుఁజూపులు నునుసిగ్గు మొలకనవ్వు, కదలుపిఱుఁదును మిగులసింగార మొలకఁ
గులుకునడఁ జేరి దిసమొల పొలసుదిండి, లేము లశ్వత్థములఁ గౌఁగిలించి రపుడు.

80

మ.

అసురాజాస్యలు కౌఁగిలించుతఱి నయ్యశ్వత్థనారాయణుం
డసమాస్త్రోపమరూపరేఖఁ దగి బుధ్ధాకారుఁడై తాను ది
గ్వసనుండై దనుజాంగనాకుచతటీగాఢాంకపాళిక్రియా
రసికుండై కళ లంటఁ జొక్కిరి సతుల్ రాగాబ్ధినిర్మగ్నలై.

81


మ.

జను లగ్గింప జలంధరాసురుని వేషంబూని తత్కాంతబృం
దను గామింపఁడొ గొల్లగుబ్బెతల మానం బెల్లఁ గొల్లాడఁడో
దనుజధ్వంసికిఁ గ్రొత్తయే త్రిపురకాంతాసంగధౌర్త్యంబు గ
ల్గినఁజాలుం జెలు లేడనైనఁ గలయున్ లీలావినోదంబులన్.

82


తే.

అంత మఱి యేమి చేసెనో యసురసతులు, బుద్ధదేవర యిది యేల ప్రొద్దువోయెఁ
గడమకథ విను మాదిత్యగణము గొలువఁ, గమలలోచనుఁ డీశుచెంగటికి నరిగి.

83


సీ.

తనమహీమహిళ శతాంగంబుగాఁ జేసి కన్నుల రెంటిఁ జక్రములు చేసి
బలితంపుటూర్పుగాడ్పుల హయంబులు చేసి యాత్మజాగ్రేసరు యంతఁ జేసి
యగ్రజుబలగ మి ల్లస్త్ర్రాసనముఁ జేసి సెజ్జయౌ చిలువ శింజినిగఁ జేసి
బలములయం దర్ధబలము రథిం జేసి తను సముత్తేజితాస్త్రముగఁ జేసి


తే.

చటులలయవహ్ని చిటచిటచ్ఛటలు వొదల, దైత్యపురములఁ గూల్చి దగ్ధంబు చేసి
శంకరుఁ బురారి యనిపించె జగములందు, శ్రితజనయశస్కరుండు లక్ష్మీశ్వరుండు.

84


మ.

కురిసెం గల్పకపుష్పవర్షములు రక్షోరాజి భీతిల్లఁగా
మొరుసెన్ నిర్జరదుందుభు ల్దివి మహాంభోవాహగర్జార్భటిన్
నెరసెం దెల్వి సమస్తదిగ్వలభులన్ నిర్నిద్రహర్షస్థితుల్
దొరసెన్ వేల్పుల నెమ్మనంబులకు నుల్లోలంబుగా నత్తఱిన్.

85


క.

శ్రీవిభుఁ డిటువలె బుద్ధుం, డై విహరించినవిధంబు హర్షము మీఱం
గా వినువారలు ప్రబలుదు, రీవసుమతి సుమతిశుభసమృద్ధులతోడన్.

86


గద్య.

ఇది శ్రీరామభద్రదయాభిరామభద్రకరుణాకటాక్షవీక్షాపరిప్రాప్తదీప్తతరాష్ట
భాషాకవిత్వసామ్రాజ్యధౌరేయ సకలవిద్వత్కవిజనవిధేయ ధరణీదేవుల నాగ
నామాత్యసుధాసముద్రసమున్నిద్రపూర్ణిమాచంద్ర రామమంత్రీంద్రప్రణీతం
బైన దశావతారచరిత్రం బనుమహాప్రబంధంబునందు నవమాశ్వాసము.

తొమ్మిదవ యవతారంబగు బౌద్ధావతారము సమాప్తము.

  1. యీయావు చక్కనై యున్న దనుచు
  2. "యజమానః ప్రస్థర"