దశకుమారచరిత్రము/సప్తమాశ్వాసము

సప్తమాశ్వాసము

.

     శ్రీకరవచను దురితదూ
     రీకరణవినోదశుభచరిత్రుని (ననుకం
     పా)కరహృదయుఁ గులాబ్ధిసు
     ధాకరశుభమూర్తిఁ దిక్కదండాధీశున్.1
క. ఉపహారవర్మఁ గనుఁగొని
     నృపుఁ డెంతయుఁ గౌతుకమున నీచరితంబుం
     జెపు మని యడిగిన నాతం
     డపరిమితా[1]నందనమ్రుఁ డై యి ట్లనియెన్.2
మ. భవదన్వేషణతత్పరత్వమున భూభాగంబు ముప్పెట్టు వె
     ట్టి విదేహాధిపుప్రోలు సొచ్చి యొక[2]బోటిం జీరవస్త్రం దపో
     భవనం బైన మఠంబునొద్దఁ గని యంభఃపానవేత్రాసనా
     దివిశేషప్రతిపత్తి నాకు నది యర్థిం జేసినం బ్రీతితోన్.3
వ. ఉన్న యెడ.4
తే, నన్నుఁ దప్పక కనుఁగొని చిన్నవోయి
     యశ్రుధారలు గ్రమ్మ నయ్యతివ వచ్చి
     నూర్చుటయు గారవించి యూరార్చి దుఃఖ
     కారణస్థితి యే నెఱుఁగంగఁ దలఁచి.5
క. అనిమిషలోచనముల ననుఁ
     గనుఁగొని చింతాభరంబు గదుర వికలచే

     తన వై యేడ్చెదు తల్లీ!
     యనుశయకారణము చెప్పు మంతయు నాకున్.6
వ. అనిన విని య త్తపస్విని యిట్లనియె మిథిలానగరంబున కధీ
     శ్వరుండు ప్రహారవర్మ యనం గలయతండు మగధపతి
     యగు రాజహంసుం డను రాజునకు మిత్రుం డై వర్తిల్లు నతని
     భార్య ప్రియంవద మాగధమహిషి వసుమతీదేవితో
     జెలిమి సేసి యి ట్లన్యోన్యస్నేహసముచితాచరణంబులం
     బరిణతం బగు సమయంబున.7
తే. మగధభూపతిదేవిసీమంతమునకు
     నాలు బిడ్డలు దానుఁ బ్రహారవర్మ
     వేడ్క నేఁగి సౌహార్దంబు వెలయ వారి
     యొద్ద నుత్సవలీలల నున్నయంత.8
ఉ. మాళవదేశవల్లభుఁ డమానుషతేజుఁడు లీలతోడ వ
     య్యాళికి వచ్చునట్లు మగధాధిపుపై వెస నెత్తివచ్చినన్
     మాళవమాగధు ల్గడు సమగ్రతమై రణకేళి సల్పుచో
     మాళవుచేత మాగధుఁడు మర్దితుఁ డయ్యె మహాద్భుతంబుగన్.9
తే. అపుడు మాళవుచేతఁ బ్రహారవర్మ
     పట్టుపడి వానికరుణయ ప్రాపు గాఁగఁ
     దనకు విడుమర గాంచి నందనులు సతియుఁ
     దాను హీనుఁ డై యెంతయు దైన్య మొంది.10
వ. విరళపరిజనపరివృతుం డై నిజదేశంబున కరుగుదెంచునప్పు
     డేనును మత్పుత్రియుం దత్కుమారు లిరువురు గావున వారల
     నెత్తికొని వచ్చుచుండితి మట్టియెడ.11

క. జనపతి శిథిలితగతిఁ గా
     ననదుర్గమ మైన తెరువునం దాఁకిరి చు
     ట్టును ముట్టి దాపశిఖిచా
     డ్పునఁ దివురు శరార్చు లడర బోయలు పెలుచన్.12
ఆ. అపుడు ధరణివిభుని యంతఃపురాంగనా
     జనముఁ బొదివి యాప్తజనులు కొంద
     ఱొక్కదిక్కుఁ దొలఁగ నొకభంగిఁ గొనిపోయి
     రేటు దాఁకి నొచ్చి యేను బడితి.13
క. ఆతఱి నుధ్ధతుఁ డొక్కకి
     రాతుఁడు చనుదెంచి యధికరభసమున న్నా
     చేతికుమారునిఁ జేకొని
     యాతతగతి నంత నతనికై చనియె వడిన్.14
వ. ఏనును పోటుగంటి నెత్తురు వడసి తెప్పిఱి మర్మంబు గాడ
     కునికిం జేసి ప్రాణంబు విడువక యీయవస్థ గుడుచుటకుం
     గా బ్రతికి పతి యరిగినదెస నల్లనల్లన చని యొక్క పల్లె
     లోనం బథశ్రాంత యై యున్నకూఁతుం గని దానివలన
     రెండవకుమారుండును బోయలపాలువడి పోవుట విని నా
     తెఱంగునుం దానికిం జెప్పి యడవి నే మిరువురము నొం
     డొరువులం గౌఁగిలించుకొని యేడ్చుచున్నంత.15
క. అం దొకధర్మపరుం డా
     క్రందనములు దీర్చి మమ్ము గారవ మెసఁగన్
     మందిరమునకుం గొని చని
     [3]మం దిడి నాపోటుగంటి మాన్చెఁ గ్రమమునన్.16

ఆ. ఇట్లు దడిమి ప్రోచి యెంతయుఁ బ్రియ మెస
     లార ననుప నేను నాత్మజయును
     నిందు వచ్చితిమి మహీనాథు తెఱఁగును
     వినుము క్రమముతో సవిస్తరముగ.17
క. అరిమర్దనమున ధృతి చెడి
     తెరు పడిచినచోట నున్న తేజముఁ జెడిఁ త
     త్పరివారముదర్పము సెడి
     పురమున కేతెంచె నతఁడు పులుమానిసి యై.18
ఉ. అంతకుమున్న తొల్లి పురి నాతఁడు ప్రోవఁగ హీననృత్తిమై
     నెంతయు సాధుమార్గమున నేడ్తెఱ దక్కి చరించుచున్నదు
     స్స్వాంతుడు దుష్టుఁ డై వికటవర్ముఁడు సందునఁజొచ్చి శంక యా
     వంతయు లేక గర్వ మెసలారఁగఁ బట్టముఁ గట్టె గ్రక్కునన్.19
వ. వాఁడును నమ్మహీవల్లభు సహోదరుతనయుండు గావున
     నరాజకంబైన పరివారంబు వానిని బురికి రాజుం జేసికొని
     యున్న కతంబున.20
క. పుడమి ప్రజ యెల్లఁ గాచిన
     ముడివడి రాజ్యంబు దీప్తముగ నున్నెడ న
     ట్లెడ రై వచ్చిన నరపతి
     గడుఁ గ్రూరతఁ బొదివి పట్టి కట్టం బంచెన్.21
తే. కట్టి తెచ్చినఁ జూచి సంకలియఁ బెట్టఁ
     బనిచి కారాగృహంబున నునిచె దార
     సహితముగఁ గూడుఁ జీరయుఁ జక్కఁ బెట్టఁ
     డధమవృత్తిమై నడపెడు ననుదినంబు.22

వ. అది రా జున్నభంగి యేమును నేలినవానికిం బొడసూపి
     కుమారులు కిరాతులచేఁ బడిపోకయు మావచ్చిన తెఱం
     గును నెఱింగించితిమి.23
చ. చరణము లేమి నే జఱభిచందము చేకొని యున్న దాననా
     వరసుత యిప్పు డీవికటవరుని వల్లభి యైన కల్పసుం
     దరికడ నిల్చి హీనచరితంబు మెయిం బనిసేయుచుండు నె
     వ్వరు దెస నాకు నీపరిభవంబునకుం గడ యెద్ది పుత్రకా!24
ఆ. అడవిపాలు వడిన యారాజనందను
     లింతదాఁక నిలిచి రేని యింత
     లౌదు రిట్ల వారి యాకారములు నని
     శోక మడరె నిన్నుఁ జూచుటయును.25
వ. అనిన మా చేరినభంగిం బ్రసంగంబులం జెప్పికొన రాజు
     పరివారంబువలనం బలుమాఱును మున్ను వినుటం జేసి యే
     నును నపహారవర్మయు నీయమ్మ చెప్పిన బాలుర మగుదు
     మని మనంబున నిశ్చయించి యేను నీ పెంచినవాఁడ భవత్పు
     త్రిచేతికుమారుండు బ్రదికె ననవుడు విస్మయహర్షసంభ్రమం
     బులు ముప్పిరిగొనం దప్పక నన్నుం గనుంగొనుచు నున్న
     యవ్వకు నేము రాజహంసనరేంద్రుం జేరి పెంపం బెరిఁగితి
     మని రాజు మముం జేకొనియున్న తెఱం గెఱింగించి నృపతి
     వృత్తాంతంబును వసుమతిప్రముఖులైన యంతఃపురకాంతా
     జనంబునుం బరివారంబునుం బేళ్ళును సాభిజ్ఞానంబు గాఁ
     జెప్పి దేవరజననంబును స్వరూపంబునుం బ్రభావంబును జరి
     త్రంబునుం గీర్తించి యే నతని నన్వేషించుటకుం బరి
     భ్రమించుచున్నవాఁడ నని తెలియం బలికిన.26

క. విని హర్షాశ్రుజలంబులఁ
     గనుదోయి మునుంగఁ జన్నుఁగవఁ బా లొలుకం
     దనువునఁ బులకలు నెగయఁగ
     నను గాఢాలింగనంబునం గొనియాడెన్.27
వ. ఇవ్విధంబున సంభావితుండ నై కలసి యిట్లంటి.28
ఆ. ఇంక మనకుఁ గార్య మెయ్యది యొకొ రోష
     వేగ మడరి బాహువిక్రమంబు
     మెఱయఁ బగతుమీఁద నుఱికి యొక్కఁడఁ జంప
     వచ్చునట్లు చేఁత వలను గాదు.29
క. ఇత్తెఱుఁగు పరిజనములకుఁ
     జిత్తక్షోభంబు సేయుఁ జేసిన నాకున్
     మెత్తనిమెయితో రాజ్యం
     బెత్తిలఁ గొనరాదు నన్ను నెఱుఁగరు వారల్.30
క. ఏ నీచెఱ నున్న నృపతి
     సూనుఁడ నని ప్రజకుఁ దెలుపఁ జొచ్చితినేనిన్
     దానఁ బ్రమాదము పుట్టుం
     గానఁ దెఱఁగు పడదు వలయు కార్యము మనకున్.31
క. కావున మృదుమార్గంబున
     నీవు సహాయంబు గాఁగ నిర్జించెద నే
     నీవికటవర్ము నేలెద
     భూవలయం బస్మదీయబుద్ధిబలమునన్.32
వ. అనిన నత్తపస్విని ప్రియం బంది యిట్లనియె.33
క. దైవంబ సహాయంబుగ
     నీ విచటికిఁ జేరి తింక నీకుం జేయం

     గావలయు పనులు నరయఁగ
     దైవాయత్తములు వగపు దక్కుము కొడుకా!34
క. అని నాకు న్మజ్జనభో
     జనములు నాదరణమును బ్రసన్నత గావిం
     చినఁ దుష్టి బొంది యమ్మఠ
     మున నొక్కెడ విశ్రమింప మునుమా పగుడున్.35
తే. అచ్చటికి నోర్తు వచ్చిన నవ్వ నన్ను
     నెలమిమైఁ జూపి దానికి నిట్టు లనియె
     దైవగతిఁ జేరెఁ జూచితే తరుణి! నాఁడు
     బోయచేఁ బడి పోయిన భూపసుతుఁడు.36
వ. అని యది కూఁతు రగుట నా కెఱింగించి యేను దనచేతి
     కుమారుం డనియును దానియెత్తికొనివచ్చినవాఁడును బ్రతి
     కియునికియు నవి మొదలుగాఁ దాను నాచేత విన్నవృత్తాం
     తంబు లన్నియు దాదికిం జెప్పి యతనిబుద్ధిపరాక్రమంబుల
     వలనను దైవయోగంబునను మన కెల్లకార్యంబులు సిద్ధించు
     ననిన నదియును సంభ్రమసంతోషంబు లడర నన్నుం గౌఁగి
     లించుకొని మ్రొక్కి వినయంబుతో సల్లాపంబు సేయుచున్న
     సమయంబున దానికి నంతఃపురంబున మచ్చికతోడినడవడి
     గలుగుటయు నెఱింగికొని.37
చ. పగతునిఁ జంప నెన్నియు నుపాయము లారయుచున్న నాకు ని
     మ్మగువ నిజంబుగా నృపతిమందిరవృత్తము చెప్పెనేని నేఁ
     దగు లిడి నిశ్చయించి యుచితస్థితిఁ జేయుదు లోకసమ్మతం
     బగుగతిఁ గార్యజాత మని యాత్మఁ దలంచి కరంబు నెమ్మితోన్.38

తే. రాజుచందంబు నంతఃపురంబువిధము
     నీయెఱింగినతెఱఁ గెల్ల నెలఁత! నాకుఁ
     దెలియఁ జెప్పుము కార్యంబు తెగువ గాంచి
     నిర్వహించెద నెంతయు నేర్పు మెఱయ.39
తే. అనిన విని దానితల్లి యి ట్లనియె మనకు
     బ్రదుకుఁదెరువగు నితనితోఁ బడఁతి! నీవు
     కల తెఱం గెల్లఁ బ్రకటించి గారవమున
     నెపుడు ననుకూల వై చరియింపు మనియె.40
వ. అనిన నయ్యింతియు నట్లు కాక నా కింతకు మిగిలిన పనియు
     నుం గలదె యని నాతో ని ట్లనియె.41
చ. నరపతి రూపహీనుఁడు మనఃప్రియ యై వికసిల్లు గల్పసుం
     దరి కడుఁ జక్కనైనను నతం డవమానము సేసి యాకృశో
     దరి యెఱుఁగంగ నొండెడలఁ దత్పరుఁడై విహరించు దానికిం
     గరకరిఁ బొందియుండి యవుఁ గా చన దాయమ గూఢచిత్త యై.42
తే. రూపయౌవనగర్వాధిరూఢ గాన
     సరకు సేయదు మగని నచ్చపలనయన
     దీని నెఱుఁగఁడు మనమునఁ దెలియకుండు
     వికటవర్ముండు గడు నవివేకి యగుట.43
క. గురువెంద వేము నడరిన
     పరుసున నవ్వికటవర్మ పాల్పడి చెన్నుం
     బొరయక మెలఁతుక యెప్పుడు
     విరసాంతఃకరణ యగుచు వేదనఁ బొందున్.44

వ. అనిన విని యాత్మగతంబున.45
ఉ. ఎమ్మెయినొక్కొ దానిమన సేఁ జొరఁజాలుదు నెట్టిదానఁగా
     ర్య మ్మగునొక్కొ తా విరస యైన సతి న్ననుఁ గూర్చికొన్నఁ గా
     కిమ్ముల వాని నోర్చు టెటు లేఁ దగు నీపని పూని చేయ శ
     క్యమ్మొకొ య త్తపస్వినికి నాత్మజకుం గ్రియ దీని కెట్లొకో.46
క. మునుమును మానినిచిత్తం
     బునఁ గోపము పుట్టఁ జేసి పురుషుని దెస నొ
     చ్చిన సందునఁ జతురతమెయి
     నను నెఱిఁగించుటయ వెరవు నాకుం జూడన్.47
వ. అని యూహించి దానితో ని ట్లంటే,48
ఉ. మాటలఁబొందు సేసికొని మాటికిమాటికిఁ బోయిపోయి పల్
     మాటల రాజు చేయు కుటిలక్రియ లెల్లనుఁ దెల్పి తెల్పి య
     జ్జోటికి నీసు రోసమునుఁ జొన్పి మదిం గలుషింపఁజేయు మి
     ప్పాటఁ జరించు పిమ్మట నుపాయము సెప్పెదఁ గార్యసిద్ధికిన్.49
వ. అని పనిచి యేనును నిగూఢంబుగా నమ్మఠంబున వర్తించు
     చుండ నొక్కనాఁడు.50
క. తనపూని సేయఁ దొడఁగిన
     పని సఫలంబైన దాది ప్రమదంబు మనం
     బున [4]నుండి పొంగి వెలివిరి
     సినచాడ్పున వచన ముల్లసిల్లఁగ నాతోన్.51
చ. పనిచినచొప్పునం దగిన పల్కులమై వడిఁ గల్పసుందరిన్
     జనపతియందుఁ జాల విరసం బగుచందముఁ బొందఁ జేసి తిం

     క నిట భవత్ప్రయత్నముప్రకారము బుద్ధి నెఱింగి దాని కే
     ననుగుణ మైనభంగి నెడయాడఁగఁ జొచ్చెద [5]నీతి చెప్పుమా.52
వ. అనిన విని పుష్కరికం బిలిచి పలకయుం జిత్రసాధనంబులు
     సవరించి తేరం బనిచిన నదియును దత్క్షణంబ కొనివచ్చు
     టయు.53
క. వల నేర్పడఁగ సురేఖా
     విలసన మొప్పంగఁ జాలు విన్ననువునఁ జె
     న్నలవడ నారూపం బా
     పలకం జిత్రించితిని సుభగవర్ణముగాన్.54
వ. ఇట్లు వ్రాసి చిత్రఫలక దాదిచేతి కిచ్చి దానితో ని ట్లంటి.55
తే. దీనిఁ గొని కల్పసుందరీదేవికడకు
     నేఁగి పరిజను లెవ్వరు నెఱుఁగకుండ
     నుత్తరీయంబు మాటుగా నునిచి పిదప
     నేకతంబునఁ జూపు మయ్యిందుముఖికి.56
క. చూపి యుచితంబులగు స
     ల్లాపంబుల నాలతాంగి లౌల్య మెఱిఁగి ర
     మ్మా పదపడి చేయఁగ మన
     కేపని దగు దాని నీకు నెఱుకపఱచెదన్.57
క. అనవుడు నట్లన చేయుదు
     నని యది యాచిత్రఫలక మడఁకువతోడం
     గొని యంతఃపురమునకుం
     జని వచ్చెం గొంతవడికి సంతస మెసఁగన్.58

వ. వచ్చి యి ట్లనియె.58
క. ఆకాంతారత్నమునకు
     నేకతమున [6]నీదు పలక యిచ్చితిఁ దచ్చి
     త్రాకారం బుజ్జ్వలరే
     ఖాకీలితదృష్టిచిత్త యై యుత్సుకతన్.59
సీ. కనురెప్ప వెట్టక కనుఁగొని విస్మయం
                    బనురాగమును మదిఁ బెనగొనంగఁ
     దల యూఁచి యిట్టుచిత్రపురూపు నేఁ జూచి
                    యెఱుఁగ నింతకుమును పెన్నఁడైన
     నీయొప్పు గలనరుం డెందునుం గలుగంగ
                    నేర్చునె కలిగిన నెలఁతపిండు
     చూడ్కులు మనములుఁ జూఱఁగోలుగఁ గొని
                    కామున కతఁ డోరగట్టు గాఁడె
తే. యనుచుఁ బెక్కువిధంబుల వినుతి నేసి
     తగుల మేర్పడఁ బలికె నమ్మగువకొలఁది
     గాంచి పుయిలోట సెడి తమకంబు వెనుప
     నిదియ తఱి యని తలఁచి యే నిట్టు లంటి.60
మ. అవనీచక్రము పెద్దయున్ విపుల మందాశ్చర్యము ల్పెక్కు లి
     క్కువ మై యిట్టివిధంబు రూపములు గల్గుం గల్గినన్ మేదినీ
     ధవు నంతఃపురకాంత లైన నినుఁ జెంతం జేరఁగా వచ్చునే
     తవులం దీరునె నీకుఁ బిమ్మట మనస్తాపంబ శేషింపదే.61
వ. అనిన విని యవ్వనిత సకౌతుకంబుగా నన్ను గౌఁగిలించు
     కొని యి ట్లనియె.62

ఉ. నామన మారయం దలఁచి నవ్వుల కి ట్లని చెప్పితో నిజం
     బై మనవీట నిట్టి సుభగాకృతి గల్గిన వానిఁ గాంచి నీ
     వీ మెయి నల్లఁ బొందుఁ గొని నేర్పడ నాడిరొ నన్ను నన్న కా
     నీ మది నమ్మి శంకచెడి నిక్కపుఁజందము నాకుఁ జెప్పుమా.63
క. అని చిడిముడిపడి యడిగిన
     వనితా! నిక్కంబు చెప్పవలయునయేనిన్
     విను మిట్టిరూపుగల నృప
     తనయుఁడు గలఁ డేను గంటిఁ దథ్యం బంటిన్.64
మ. అనినం గ్రక్కున లేచి మచ్చరణపర్యంతక్షితిం జాఁగి మ్రొ
     క్కిన నే సంభ్రమ మొంద నెత్తి లలితాంగీ! యింత పాటింపఁగాఁ
     జనునే నన్ను భవన్మనోరథము నిష్ఠన్ దేర్చెదం జెప్పు నీ
     పని సేయం గని ధన్య నైతి ననుడున్ భావంబు రంజిల్లఁగన్.65
తే. నీవు చెప్పిన యాతని నేవిధముల
     నైన నెలయించి ననుఁ గూర్పు మట్లు గాక
     కడపి యెడ సేసినను నాకుఁ గాముఁ డేల
     చక్క మానంబు ప్రాణంబు దక్కనిచ్చు?66
వ. అని యివ్విధంబునం బ్రేమాతుర యై వెండియు ని ట్లనియె.67
సీ. అవ్వ! నావృత్తాంత మంతయు నేర్పడ
                    విను మేను జెప్పెద మును ప్రహార
     వర్మునిప్రియ ప్రియంవదయును మాతల్లి
                    కమలయుఁ జిరబాంధవమునఁ దగిలి
     యొండొరువులతోడ నొప్పిదంబుగ వియ్య
                    మందువారుగ నిశ్చయంబు సేసి

     రంతఁ బాపమునఁ బ్రియంవద కొడుకులఁ
                    గాంతారభూమిలోఁ గాడుపఱచి
తే. వచ్చిపట్టంబు గట్టినవాఁడు గాన
     వికటవర్మకు ననుఁ దండ్రి వేడ్క నిచ్చె
     నీ వెఱుంగనియవియె యన్నీచుచేతఁ
     బ్రతిదినంబు నేఁ బడియెడు పాటు లెల్ల.68
శా. చాతుర్యంబుల చెంతఁ [7]జెందఁడు కులాచారంబు కోరండు వి
     ద్యాతత్త్వంబుల మే లెఱుంగఁడు వినోదక్రీడ లొల్లండు మే
     ధాతత్త్వంబుల పొంతఁ బోఁడు రతితత్త్వప్రౌఢుఁడుం గాఁడు భా
     మా! తెంపుంబడి యైన యీవికటవర్ముం జెప్పఁగాఁ గూడునే?69
క. ఒప్పర మిడి సతికిం గల
     యొ ప్పెఱుఁగఁడు తనమనంబు నొల్లమిఁ దాఁపం
     డెప్పుడు చూచినబీరపుఁ
     దప్పులె యొనరించు నా కతఁడు పతి యగునే?70
ఉ. ఇంచుక యేనిఁ బెం పెఱుఁగఁ డెంతయు వేడుక నేనుఁ బుత్రుగాఁ
     బెంచిన మావిమోఁకకడఁ బ్రీతి మదీయవయస్య యైన యి
     క్కాంచనమాల నెల్లచెలికత్తెలు నవ్వఁగ నంటఁబట్టె నా
     పంచున కాలనై పడనిపాటుల నేఁ బడితిం దపస్వినీ!71
క. రమణీయలతాగృహమున
     రమయంతియుఁ దాను నిచ్చ రమియింపఁగఁ దె
     ల్లమిగా నా చెలి చూచె వ
     శమె యవమాన మిటు సేయ సైరింపంగన్.72

క. తన కసదృశుఁ డగు పురుషుడు
     దను మెచ్చక యొరులవలనఁ దగిలినవానిం
     గనుఁగొనిన మానవతి యగు
     వనితకుఁ జిత్తంబు నూఱు పఱియలు గాదే?73
క. కావున మగఁ డని పలుకఁగ
     నేవం బగు వికటవర్మ యేటి మగఁడు నీ
     వావసుధాధిపనందను
     వేవే తో డ్తెమ్ము మాధవీగృహమునకున్.74
వ. అనిన విని యమ్మగువ తెఱం గెఱింగి యఱ సేయక యి
     ట్లంటి.75
చ. పలుకులు వేయు నేల నరపాలతనూజుఁడు నాకు మిత్రుఁ డి
     మ్ములఁ గొనివచ్చి కూర్చెదఁ బ్రమోదముఁ బొందుము తక్కు మింక ను
     మ్మలికము వాఁడునుం గుసుమమార్గణపీడితమానసుండు వి
     చ్చలవిడి నీకు నాతనికి సంగతి చేకుఱు నమ్ము మెమ్మెయిన్.76
వ. అని పలికి వసంతకేళినాఁడు నరపతిసమేతంబుగా సఖీజనం
     బులు దానునుం బురవీథి నరుగుచుండ నొక్కజాలకంబున
     నీవు దన్నుం జూచితనియును నది మొదలుగాఁ గదిరిన మద
     తాపంబునం దలరియున్నవాఁడననియునుం జెప్పి నన్నుం
     బొందు గొని యిత్తెఱం గెఱింగించి తనరూపంబు చిత్రించి
     దీనిం గొనిపోయి కల్పసుందరికిం జూపి యచ్చెలువ చిత్తం
     బుకొలంది యరసి రమ్మని నియోగించె ననియునుం జెప్పిన.77

క. పులకలు వొడమఁగఁ బ్రమదా
     శ్రులు గ్రమ్మఁగ హర్షరసము రూపైనగతిం
     బొలఁతి నను దిగిచి తనకౌఁ
     గిలిపొందునఁ జేర్చెఁ గడు బిగియ నింపాఱన్.78
వ. ఇట్లు గాఢాలింగనంబు సేసి నా మొగంబు గనుఁగొనుచు
     ని ట్లనియె.79
చ. లఘు వని నన్ను నీమదిఁ దలంచితివేని తలంపు వానికై
     యఘముల కోర్తు నీనిలుపు నాసపడన్ విను మిట్టివాఁడు దై
     వఘటన నాకుఁ జొప్పడియె వంశము వృత్తము నింక నొల్లఁ బ్రే
     మ ఘనమనోరమైకరసమగ్నతఁ బొందితి నేమి సేయుదున్.80
తే. అనినఁ దగు లూనుటకు సంశయంబు లేమి
     యుల్లమునఁ దెల్లమిగఁ గని యూఱడిల్లి
     వెండియును నిశ్చయము సేయ వేఁడి యుచిత
     వచనమున నిట్టు లంటి నవ్వనితతోడ.81
ఉ. నీ నెన రిట్టిచంద మని నిక్కముగాఁ గొని నిన్ను నమ్మితిన్
     మానిని! యింక నొండు వెడమాటలు దక్కు కుమారుశక్తివి
     జ్ఞానపరాక్రమంబుల కసాధ్యము లెవ్వియు లేవు కావునన్
     వానికి నీకుఁ బొం దగు నవశ్యము నూఱడు మెల్లభంగులన్.82
వ. అనిన నత్తెఱవ మఱియు ని ట్లనియె.83
క. నీవు గల ఫలము నా కా
     భూవరనందనునితోడఁ బొం దొనరింపం

     గావలయుఁ బౌరుషంబును
     దైవము నొడఁగూర్చి యెవ్విధంబున నైనన్84
వ. అని యిట్లు ప్రార్థించిన.85
చ. మనమున సంతసిల్లి యనుమానము దక్కి తలంపు సిద్ధిఁ బొం
     దెన యని నిశ్చయించి సుదతిం దగ వీడ్కొనునప్పు డెవ్విధం
     బునఁ గొనివత్తు వాని నని పూని నిజంబుగ నూఱడించి పు
     ట్టిన తెఱఁ గెల్ల నీకుఁ బ్రకటింపఁగఁ గోరి కడంగి వచ్చితిన్.86
వ. అని యిట్లు కల్పసుందరి యంతర్గతంబు సవిస్తరంబుగా
     నెఱింగించిన నాతలంచిన కార్యంబు సఫలంబుగా నోపుట
     నిశ్చయించి.87
తే. సుందరీమందిరంబుల చందములును
     గాపువారలు మెలఁగెడు కందువలును
     హృద్యకేళీవనంబుల యెడల తెఱఁగు
     దగిలి యడిగి యెఱింగితి దానివలన.88
వ. అంత.89
క. వారిజబాంధవుఁ డను నం
     గారం బపరాబ్ధిఁ బడిన గ్రక్కున నెగసెన్
     సూరెల ధూమం బనఁగ న
     వారిత మై కవిసెఁ జీకువా లెల్లెడలన్.90
చ. తనమది మెచ్చు కేళి గురుదారపరిగ్రహవృత్తి గాన న
     న్నును దదుపాయసంపద మనోరథసిద్ధిసమేతుఁ జేయ వే
     డ్కన చనుదెంచె నీతఁ డనగా శశి పూర్వగిరీంద్రమస్తకం

     బున వెలుఁగొందె లోకములు పొంపిరివోవఁగ నింపుసొంపునన్.91
క. ఏనును జేయు తెఱం గెద
     లో నాలోకించి ధర్మలోభము ధర్మ
     గ్లానికర మయ్యె నని య
     బ్జాననఁ బొందుటకు సంశయము మొల తేరన్.92
మ. పరదారాభినివేశబుద్ధి దలఁపం బాపంబు ధర్మార్థముల్
     దొరకొల్పంగ నుపాయమైన నది నిర్దోషంబు నాఁ దొల్లి బం
     ధురశాస్త్రజ్ఞుల చేత నిందు గురుబంధుక్లేశమోక్షార్థికిన్
     దురితం బయ్యెడు నెట్లు? చిత్తమున కాందోలాయితం బేటికిన్?93
వ. అనుచు శయ్యాతలంబునకుం జేరి నిద్రవోవునప్పుడు.94
సీ. ఏ నొకనాఁడు గంగానదిలోపల
                    నవగాహనము చేసి యాడుచున్న
     నురలి కలంగి నిల్పోపక కోపించి
                    జాహ్నవి నా కొక్కశాప మిచ్చె
     మనుజుఁడ నగు మని; మగుడ శపించితిఁ
                    గాంతవై మర్త్యలోకమునఁ బుట్టి
     పలువుర భాజనంబవు గమ్ము నీ వని
                    యది యాదిగా నిప్పు డవనిమీఁద
తే. నమర నరి కల్పసుందరి యై జనించె
     నేను నీ వై జనించితి నెగ్గు లేదు
     సందియంబులు దిగఁ ద్రావి సుందరాంగిఁ
     గలయు మని చెప్పెఁ గలలోన గజముఖుండు.95

క. కలఁ గని మేల్కని మును మదిఁ
     గల సందియ మెల్ల విడువఁగా నప్పుడు కో
     ర్కులు చిక్కువఱచె మరుఁ డ
     మ్ములవానలు చూపెఁ దాపమున కిర వైతిన్.96
ఆ. సరసిజాప్తుఁ డుదయశైల మెక్కినయది
     యాది గాఁగఁ గ్రుంకునంతదాఁక
     నరసి తెలిసి కంటి నంగనకడ కేఁగు
     తెఱఁగు తెల్ల మదికిఁ దేటపడఁగ.97
వ. ఇ ట్లుపాయంబు గాంచి నేఁడు మాధవీమండపంబున కతం
     డెల్ల భంగులం జనుదెంచు నని కల్పసుందరికి వా రెఱింగిం
     చునట్లుగాఁ బనిచి యుపకరణంబులు సమకట్టి పురంబులోని
     సందడి డిందుపడుటయు.98
క. నీలాంబరంబు పట్టిన
     వాలును బెరయంగఁ జీకువాలునఁ గాంతా
     కేలీకుతూహలంబునఁ
     గ్రాలెడు చిత్తంబు తోడుగాఁ బ్రీతి మెయిన్.99
క. నరపతివప్రముఖసరి
     త్పరిసరమున నోలమైన పట్టున నాపు
     ష్కరికకు నేకత మొకయో
     వరి గలుగుట నందుఁ జని యవారణ నచ్చోన్.100
తే. డాఁచియుంచిన వంశదండంబు దెచ్చి
     నేలపై వైచి వప్రము నిలువఁ జేర్చి
     కోటయును దాటి పోయి నిష్కుటముఁ జొచ్చిఁ
     దాది చెప్పిన తెరువుచందంబుఁ దలఁచి.101

సీ. జలజాకరము తూర్పు సహకారవీథికి
                    నుత్తరం బై పోవ నొక్కకేళి
     పర్వతం బున్న డాపలఁ బెట్టి చని యశో
                    కావలి దఱియంగ నరిగియరిగి
     మలఁగినదెసఁ బడమరమొగంబై కొంత
                    ద వ్వేఁగి పున్నాగతరువు గాంచి
     యచటికి బది తప్పుటడుగులు దక్షిణం
                    బున సగుణోజ్జ్వలవనము క్రేవ
తే. మూసి డించిన సందున మొక్కలంబు
     తోఁపఁ దోతెంచుదీప్తులతోడి దివియ
     గారవంబునఁ గనుఁగొని చేరఁబోయి
     మాధవీమండపం బని మది నెఱింగి.102
క. తలిరు లను చేపపట్టెల
     నలవడఁ బొందించు జైత్రుఁ డనునోజఁ జనం
     దలుపైన చూతవిటపము
     దొలఁగంగ ముసుంగు లెల్లఁ ద్రోచి ముదమునన్.103
వ. ఆవ్యవహారగృహాభ్యంతరంబు ప్రవేశించి.104
శా. తాంబూలాంబరగంధమాల్యసహితాంతర్వేదిపైఁ బుష్పత
     ల్పం బామీనపతాకు నంపపొదిలీలం బోలినం జూచి డా
     యం బో నల్కుచు లేమ వచ్చుతెరు వే నాలించుచున్నంత హృ
     ద్యం బై వీఁకదనంబుతోన పదశబ్దంబల్లఁ బుట్టించినన్.105
చ. అరయుదు దీనిచంద మని యచ్చటు వాసి యశోకభూరుహాం
     తరితుఁడ నైతిఁ గాంతయు లతాగృహ మల్లన సొచ్చి చూచి చె
     చ్చెర నను నందుఁ గానమికిఁ జేట్పడి మన్మథవేదనార్త యై

     పురపురఁ బొక్కి యి ట్లనియెఁ బొచ్చెము లేని తలంపు పెంపునన్.106
ఉ. అక్కట చిత్తమా యనుశయాంబుధిలోపలఁ దేలి తేలి నీ
     వెక్కడ చేరి తింక ధరణీశ్వరు కార్యము కార్యరూప మై
     త్రిక్కులఁ బెట్టెఁ గాక నరదేవకుమారకుఁ డిట్టిరూపువాఁ
     డొక్కఁడు కల్గునే? కలుగ నోపిన నీ కతఁ డేల చొప్పడున్?107
ఉ. మిన్నక వచ్చి యాజఱభి మేడ్పడి చిత్రపటంబు చూపి తా
     నెన్నివిధంబులం బఱచి యిక్కకు నాఱడి యిట్లు దెచ్చునే?
     నన్ను దలంచి యిట్టి నృపనందనుఁ డిందుల కేల వచ్చు? నిం
     కెన్నఁడు నీఁగ లేని మరునేపులపా ల్పడుదాన నైతినే.108
క. ఏమిట నె గ్గొనరించితిఁ
     గాముఁడ! నీ కేను నన్ను [8]గాసించెద విం
     దేమి ప్రయోజన మసవస
     లేమిటి కొకొ మలియతీర్ప వేలకొ చెపుమా?109
వ. అని మఱియు ననేకప్రకారంబులం గల్సుందరి తనయంత
     రంగంబు బయలుపడ పల్కుచున్న నేనును బొడసూప
     నదియ సమయం బగుట నల్లన సొచ్చి దివ్యాభరణంబు
     పాయంబుచ్చి.110
సీ. భావజు పట్టపుదేవి యై రూపున
                    సడిసన్న రతివిలాసములఁ గెల్చి
     యతను ధనుర్గుణం బైన భృంగావలి
                    నీలాలకచ్ఛాయ నేలు దెంచి

     యంగసంభవుని కట్టనుఁగైన యమృతాంశు
                    నాననాంబుజకాంతి నూనపఱచి
     కందర్పుసేనముంగలియైన నునుఁగమ్మ
     దను గాలి నూర్పుగాడ్పున జయించి
తే. యున్న నిన్నుఁ జిత్తోద్భవుఁ డిన్నివిధులఁ
     బఱచు టరయంగ నుచితంబె పంకజాక్షి!
     యెన్నరాని బన్నంబుల నన్నుఁ బఱచె
     నేను వానికిఁ జేసిన యెగ్గు గలదె?111
క. పొందుగఁ గాయజువిషమునఁ
     గందిన నాయంగములకుఁ గామిని! యమృత
     స్యందియగు నీకటాక్షము
     మం దొనరింపుము దయార్ద్రమతి నింపెసఁగన్.112
మ. అని యజ్జోటికి విస్మయంబును బ్రమోదావేశముం జేసి య
     ల్లన పొం దొంది కవుంగిలించి సరసాలాపంబు పుట్టించి యా
     ననపద్మము ముఖంబునం గమిచి మేనం జొప్పు గాకుండ మె
     త్తన కామాంకము లావహించి రతితంత్రవ్యాప్తి మోదించితిన్.113
క. సురతాంతోచితకృత్యము
     లరుదుగ నొనరించి యున్న యవసరమున నేఁ
     బరిరంభణమ్ము సేసిన
     నరుగుతలం పెఱిఁగి పంకజానన పలికెన్.114
క. నీవుం బ్రాణము నాకును
     భావింపఁగ నొక్కరూపపరమార్థము నీ
     పోవుట విను ప్రాణము తెగఁ
     బోవుట సంశయము లేదు భూపకుమారా!115

ఉ. కావున నన్నుఁ దోడ్కొనియ కాని చనం దగ దంచు బాష్పసం
     ప్లావితనేత్ర యైనఁ గని పల్కితిఁ గోమలి! యెవ్వఁడైన ల
     క్ష్మీవనితాసమాగమము సేకొన నొల్లక బుద్ధిహీనుఁడై పో
     వఁగఁ ద్రోచునే! యడలు పోవిడు మే నొకమాట చెప్పెదన్.116
వ. అనినం జిత్తంబు నుత్తలంబు దక్క వికసితవదనయు మదీయ
     భాషణాకర్ణసజనితకుతూహలయు నై యున్న యన్నెలం
     తకు ని ట్లంటి.117
సీ. నారూపమున నభినవమైన యాచిత్ర
                    పట మేకతమున నీపతికిఁ జూపి
     యీచిత్రరూపంబు నెనయగు మగరూపు
                    గానంగఁ గలదె యెందైనఁ జూపు
     నాకు నా నతఁ డిట్టి నరు లెట్లు గలుగుదు
                    రెందును? నన్న నీ విట్టు లనుము
     జననీసమానత మనయింటి కొకవృద్ధ
                    తాపసవృత్తి నిత్యంబు వచ్చు
తే. నధిప! యాయవ్వ నేఁడు దయారసైక
     చిత్త యై యొక్కమంత్రంబు చెప్పి పటము
     నిచ్చి తత్సాధనక్రమ మెల్ల నాకు
     నేర్పరించి యేకతమున నిట్టు లనియె.118
తే. వనజలోచన! చెప్పెద వినుము మంత్ర
     సిద్ధి గావించు శ్రమ మెల్ల బుద్ధి సేసి
     నృపతి యనుమతి నమవస నుపనసించి
     పావనస్నానశుద్ధ వై నీవు వచ్చి.119

ఉ. అంబరచందనాగురుఘృతాదులు విప్రహుతోజ్జ్వలాగ్నికుం
     డంబున నేకతంబునఁ బటస్థితరూపముమీఁద నీశుమం
     త్రంబున వేల్పు వేల్చి మఱి తద్రుచిరాకృతి దాల్పు తాల్చి నా
     దం బెసఁగంగ ఘంటిక కదల్పు కదల్చిన దానిసన్నకున్.120
క. చనుదెంచి మేదినీపతి
     మును మంత్రులతో రహస్యమున నాలోచిం
     చిన కార్యజాల మంతయు
     వినిపింపఁగవలయు నీకు విస్రంభమునన్.121
క. వినిపించి పిదప సాష్టాం
     గనమస్కృతిపూర్వకంబుగా నగ్నికి న
     ర్చన లిచ్చి నీదుకౌఁగిలి
     గని యతఁ డారూపు దాల్చుఁ గమనీయముగన్.122
ఆ. అంత నీవు తొంటియారూపు దాల్తు మృ
     గాక్షి! దీన సందియంబు లేదు
     మనుజపతికి నీకు మది కియ్యకో లైనఁ
     జేయు మనియె నర్థి జీవితేశ!123
క. నీకును మంత్రులకును నీ
     లోకమువారలకు నాత్మలో నిశ్చిత మై
     కైకోలు గలిగెనే మన
     మీ కార్యము చేయు టురవ యెడ గాకుండున్.124
వ. అనిన వాడును దీని కొడంబడు నీమాధవీమండపప్రదేశం
     బున హెూమకుండంబు నిర్వర్తించునట్లు గావించి సం
     ధ్యాసమయంబున మంత్రజ్ఞుం డైన బ్రాహ్మణుండు పశువిధి
     సేయించి వేల్పించిన యనంతరంబ యేను సొత్తెంచి

     యయ్యెడ నిగూఢంబుగ నుండునంత నంధకారంబు సాం
     ద్రం బగుటయు మంత్రసాధనోద్యుక్తుండ నైన వెనుకం బతి
     కడకుం జని మేలంపునగవుతో నేకాంతంబున ని ట్లనుము.125
క. నిను నే రూపసి గా వే
     ల్చిన నాసవతులకు నీవు చెలువము మెఱయం
     గనుఁగొనవలసెం గావున
     విను నా క్రిది గనఁగ సామివేలిమి యయ్యెన్.126
క. అనిన విని యాతఁ డపు డే
     మని పలికిన వచ్చి చెప్పు మంతయు నట యే
     నిను మెచ్చించెద నూఱడు
     మని యామదిరాక్షిఁ బుచ్చి యరిగితి నధిపా!127
చ. వనరుహనేత్రయున్ వికటవర్ముని నెంతయు మోసపుచ్చి నా
     పనిచినయట్ల సేసి జనపాలుఁడు నంతటిలోనివాఁడ కా
     వునఁ బరితుష్టుఁ డై యిది యవుం గడు వేగమె దీనిచేఁత మే
     లని యొనరింపఁబూనెఁ బతి యప్పలు కెల్లెడ మ్రోసె నత్తరిన్.128
ఉ. అంతిపురంబులోపల నృపాగ్రణి దేవుల మంత్రశక్తి న
     త్యంతసురూపవంతుఁ డగు నట్టె తలంపఁగ నెందునుత్సవం
     బింతకు మిక్కిలిం గలదె? యేమిటఁ జూచిన నెగ్గు లేదు ని
     శ్చింతమునం దొడంగి [9]యఱసేయక చేయుట చిత్ర మెమ్మెయిన్.129
క. అనియెడువారును నిది వో
     లునొకో యనువారు మందులున్ మంత్రములున్
     వినుతమణిజాలములుఁ జే
     యని యాశ్చర్యములు గలవె యనువారలు నై.130

వ. ఇ ట్లనేకప్రకారంబుల జను లెల్లం గుజగుజవోవుచుండం
     బర్వదినం బగుటయు మనతలంచినవని యారాత్రిం దీర్చు
     వార మని పుష్కరికచేతఁ గల్పసుందరి నా కెఱింగించి
     పుత్తెంచిన నేనును సన్నద్ధుండ నై యున్నంతం బ్రదోష
     వేళ మాధవీమండపప్రదేశంబున శ్రీకంఠకంఠధూమ్రంబైన
     ధూమం బెగసెం బదంపడి దధి రుధిర సర్పి తిల మాష
     క్షీర కర్పూ రాద్యాహుతపరిమళితమారుతంబు సుడిసినం
     దత్క్రియానిర్వర్తనప్రకారంబగు టెఱింగి ధూమశమనా
     నంతరంబ యతినిగూఢంబుగాఁ బ్రమదవనంబు సొచ్చి లతా
     గృహంబున నోలంబు గొనియాడి చరించు సమయంబున
     నమ్ముదిత సమ్మదంబునం జనుదెంచి నన్నుఁ గౌఁగిలించుకొని
     యి ట్లనియె.131
మ. మును రాగానలసన్నిధిన్ హృదయజన్ముం డర్థిమై వచ్చి ని
     చ్చిన నంతం దనివోక నీకు నను నాచిత్తంబు నేఁ డిప్పు డీ
     యనలంబుంద గ సాక్షిగాఁ బడసి యాహ్లాదంబుతో నిచ్చెఁ గై
     కొని రక్షింపుము జీవితేశ! యిట పల్కుల్ వేయు నింకేటికిన్.132
తే. అని మృగేక్షణ మఱియు ని ట్లనియె నేను
     వికటవర్మనృపాలకు వెడ్డువెట్టి
     ఘటనయైన యమ్మాట నీకఱపినట్ల
     యర్థి నిప్పు డేకతమున నాడుటయును.133
క. విని యానరపతి వినయా
     వనతుం డై గారవించి వనజానన నీ

     పనిచినయటన చేసెదఁ
     గను నిచ్చియుఁ జూడ నేను గాంతల నింకన్.134
క. ఈకార్య మింక నీ వెడ
     గాకుండఁగ నిర్వహింపు గజగామిని! భూ
     లోకమునఁ గీర్తి నీకును
     నాకునుఁ జేయు మని తఱిమి ననుఁ బుత్తెంచెన్.135
క. ధూర్త! భవదీయకృత్రిమ
     వర్తనములు సిద్ధి బొందె వాఁ డిట వచ్చెన్
     నేర్తేని తదీయశిర
     కర్తన మొనరింపు నీదుకౌశల మొప్పన్.136
వ. అని పలికి పులకపటలీపరికలితాంగి యై నన్ను గాఢాలింగ
     నంబు సేసినం బరమానందంబునం బొంది.137
క. అనుచరుఁడఁ గానె? యీపని
     చినపని వేవే కడంగి చేసెదఁ దగ లా
     వును వెరవు మెఱయ నీమది
     ననుమానము దక్కి నీవు నంతకు నిచటన్.138
మ. ప్రతతీషండములోన నుండు మని యవ్వామాక్షితోఁ జెప్పి యే
     నతివేగంబునఁ గొంతసేపునకు రక్తాశోకశాఖావలం,
     బితఘంటాచలనంబు సేయుటయుఁ దద్భీమస్వనం బొప్పె ను
     ద్యతఘోషంబున వాని నంతకుని డాయం బిల్చుచందంబునన్.139
క. ఒడిలోఁ గుఱుచకఠారము
     గడు నొఱపుగ డాఁచికొని యగరుచందనముల్
     తడఁబడ వెడమంత్రంబుల
     నుడుగక హోమంబు సేయుచుండితి నంతన్.140

ఉ. ఆనినదంబుసన్నకుఁ బ్రియంబున వేగమె యేఁగు దెంచి య
     చ్చో నను గాంచి నిల్వఁబడి స్రుక్కి వినిశ్చలలీనబుద్ధి యై
     యాననమండలంబున భయంబును వెక్కసపాటుఁ దోఁప న
     మ్మానవనాథుఁ డున్న ననుమానము వాపఁ దలంచి పల్కితిన్.141
క. ఈసురుచిరరూపముఁ గొని
     నాసవతులఁ గలయ నని యనలసన్నిధి నీ
     చేసిన శపథముఁ గని తుదిఁ
     జేసెద నీ కే సురూపసిద్ధి ముదమునన్.142
క. అనవుడుఁ దనహృదయములో
     ననుమానము దక్కి వికసితాననుఁ డై య
     య్యనలము సాక్షిగ శపథం
     బొనరింపఁగ వికటవర్ముఁ డుద్యోగించెన్.143
ఉ. ఏనును నిట్టు లంటి మనుజేశ్వర! సత్యము లేల దేవకాం
     తానివహంబు నిన్ను నుచితస్థితిఁ బొందిన నేరఁ గానీ యీ
     మానవభామ లెల్ల నవమానము నా కొనరింప నేర్తు రి
     స్సీ నగుఁబాటుగాదె యిటు సేఁత సతీసమయంబె యిమ్మెయిన్.144
వ. కావున శపథంబు సేఁత చాలు నని మఱియు ని ట్లంటి.145
క. నీవు నమాత్యులు గూఢతఁ
     గావింవం దలఁచియున్న కార్యము లెఱుఁగం
     గా వేగ చెప్పు మిప్పుడె
     నీవికటా కార మడఁగు నే ర్పేర్పడఁగన్.146
క. అనవుడు నతఁ డి ట్లనియెను
     ఖననుం డను సెట్టి చేఁ దగ నమూల్యం బై

     వినుతికి నెక్కిన మణి గల
     దని విని కొనువార మైతి మన్యాయమునన్.147
క.. ధననంతుఁడైన శతహలి
     యను నెలమనిమీఁద లేని యన్యాయపథం
     బొనరించి పట్టుకొని యా
     తని యర్థం బెల్లఁ గొనఁగఁ దలఁచితి మబలా!148
క. ఉఱిది విషము వెరపున నిడి
     చెఱ నున్న ప్రహారవర్మఁ జెచ్చెరఁ జంపం
     దెఱఁగు విచారించితి మతఁ
     డఱగమిఁ జచ్చె ననువార మై లలితాంగీ!149
వ. అని యిట్లు పలికి మృగతృష్ణికాపానలాలసంబైన హరిణం
     బునుం బోలె సుందరాకారసంప్రాప్తిలంపటుం డై యున్న
     నేనును నింక నెడ సేయం దగ దని సమయింపం దలంచి.150
ఉ. పారముఁ బొందె నీక్రియ తపస్విని చెప్పిన భంగి నగ్నిభ
     ట్టారకుఁబూజ సేయుము దృఢంబుగ నన్నుఁ గవుంగిలింపు మిం
     పారెడు రూపముం బడయు మన్నఁ బ్రదక్షిణపూర్వకంబుగా
     ధారుణిఁ జాఁగి మ్రొక్కుటయుఁ దత్సమయంబున వాని జంపితిన్.151
ఉ. పీనుఁగు నగ్నిఁ ద్రోచి మది బెగ్గల మంది వడంకుచున్న య
     మ్మానిని యుత్తలంబుడిపి మందిర ముత్సవలీలఁ జొచ్చి కాం
     తానివహంబులో సముచితంబుగఁ గొండొకప్రొద్దు నిల్చి య
     బ్జాననచెట్ట పట్టుకొని యల్లన పోయితి సెజ్జయింటికిన్.152
క. ఆరాత్రి సుదతితోడి వి
     హారంబులఁ బ్రొద్దు పుచ్చి యందలి యుచితా

     చారక్రమ మది చెప్పఁగ
     గారవమున నెఱిఁగికొని యకంపితమతి నై.153
వ. మఱునాఁడు దినముఖోచితక్రియలు నిర్వర్తించి పరిమితా
     లంకారాలంకృతపరిజనపరివృతుండ నై యపూర్వాలోకన
     కుతూహలంబునం జనుదెంచిన యమాత్యులం గానిపించు
     కొని సోపహారంబులైన దండప్రణామంబు లావరంబునఁ
     గైకొని విస్మయవితర్కాక్రాంతస్వాంతు లగుచు నొండొ
     రువుల మొగంబులు చూచుచుండ వారలం గలపికొని
     యిట్లంటి నారూపంబుతోడన చిత్తంబు నొండైనది మనము
     విషము పెట్టి చంపం దలంచినది ప్రహారవర్మ జనకుండు గావున
     నతని విడిచి నిజరాజ్యంబున నిలిపి పుత్రకృత్యం బనుష్ఠింపం
     బ్రియంబు పుట్టెడు శతహలిసర్వస్వాపహరణంబు సేయుట
     యనుచితం బను తలంపునుం గలదు ఖననునిచేతి రత్నం
     బునకుం దగిన వెల యిచ్చి పుచ్చుకొంద మనుచు సాభి
     జ్ఞానంబు లగు కార్యంబు లెఱింగించిన.154
చ. మతి చెడి మంత్రు లందఱును మంత్రబలంబున మోహనాకృతిం
     బతి చనుదెంచెఁగాఁ దలఁచి భక్తియు మోదము నుల్లసిల్ల సం
     భృతపులకాంగులై రమణిఁ బేర్కొని నూతనరూపసిద్ధిద
     క్షత వెలయం బురంబునఁ బ్రకాశము చేసిరి గారవంబునన్.155
ఉ. ఆదివసంబునం బ్రకటహస్తిఁ బ్రియంబున నెక్కి బంధుమి
     త్రాదులు గొల్వ వైహళికి నంచితవైభవలీలఁ బోవుచో
     నాదటతో సమస్తవిషయంబులవారును వచ్చి నన్ను నా
     హ్లాదము నద్భుతంబు హృదయంబుల నెక్కొనఁ జూచి రేర్పడన్.156

క. మును దాది చేత నావ
     ర్తన మంతయుఁ దేటపడఁగఁ దండ్రి కిఁ బ్రమదం
     బునఁ జెప్పి పుచ్చి యభిషి
     క్తునిఁ జేసితి నతులభక్తితో నానృపతిన్.157
వ. ఏనును జనకానుమతంబున యువరాజపట్టంబు గట్టి చన
     వీయ విరహాతురత్వవిరసంబు లేక రాజ్యసుఖంబు లనుభ
     వించుచుండి.158
తే. కూర్మిచెలియైన యాసింహవర్మపొంటె
     మర్మభావితుఁ డగు చండవర్మమీఁద
     వచ్చి కాంచితి మిచట దేవరపదార
     విందయుగ్మంబు నిర్భరానంద మొంద.159
చ. అనిన నృపాలకుండు సఖు లందఱి మోములఁ జూచి నవ్వి యి
     ట్లనియెఁ బరాంగనాగమన మయ్యును సత్క్రియ గాదె వీనిచే
     సినయది తల్లిదండ్రులకుఁ జిత్తవిషాదవిమోచనార్థమై
     యునికి ననూనరాజ్యసుఖయోగమునన్ జనుఁ గీర్తనీయమై.160
క. అని యిట్లు తానుఁ జెలులును
     జనపతి యుపహారవర్మచరితము ప్రీతిం
     గొనియాడి యర్థపాలుం
     గనుఁగొని దరహసితవదనకమలుం డగుచున్.161
క. నీ వేదేశమునకుఁ జని
     యేవెరవున నేమి చేసి తేవేషముతో
     నేవిధమున నెటు నిలిచితి
     నావుడు నాతండు భక్తినమ్రుం డగుచున్.162
వ. ఇ ట్లనియె.163

శా. నిత్యస్తుత్యవిలాససారకవితానిర్మాణచాతుర్య! సం
     ప్రత్యగ్రేసరభూసురప్రకరశుంభత్ప్రీతిధాత్రీశదా
     నత్యాగప్రథమానకీర్తిలతికానందాగ్రశాఖాచయా
     దిత్యానోకహమత్సరోదయ! కృతార్థీభూతసంపన్నిధీ!164
క. విద్యానికషోపల! ధ
     ర్మోద్యోగనిరూఢమానసోల్లాస! రుచి
     [10](ప్రద్యోతన! సంపద్విభ
     వద్యోరాజప్రమాణ! ప్రాజ్ఞధురీణా!)165
మాలిని. (పరమకరుణభావా! భారతామ్నాయసేవా
     దరణ! వితరణాంభోధారణా)ధఃకృతాంభో
     ధర! (యనుపమభద్రీ! ధైర్య)జాంబూనదాద్రీ!
     పరిగత (నయసూత్రా! భాసురామాత్యపాత్రా!)166
గద్యము. ఇది సకలసుకవిజనప్రసాదవిభవ విలస దభినవదండి
     నామధేయవిఖ్యాత కేతనార్యప్రణీతం బైన దశకుమార
     చరిత్రం బను మహా కావ్యంబునందు సప్తమాశ్వాసము.

  1. దరవి
  2. బొట్టె
  3. మందుల
  4. నిండి
  5. నీవు
  6. నేను
  7. జేరఁడు
  8. గాసించిన నిం
  9. యెడ
  10. 165–166 పద్యములలోని కుండలీకృతభాగములు వ్రాఁతప్రతిలో శిథిలము లగుటంచేసి పూరింపఁబడినవి.