అమ్మనుడి/సంపుటి 7/మార్చి 2021/22 భాషలనూ అధికారిక భాషలుగా గుర్తిస్తూ రాజ్యాంగ సవరణ చెయ్యాలి

భాషాసాధికారత

ఆచార్య గారపాటి ఉమామహేశ్శరరావు 98661 28846


22 భాషలనూ అధికారిక భాషలుగా గుర్తిస్తూ రాజ్యాంగ సవరణ చెయ్యాలి



భారతీయభాషల సాధికారతకై “బెంగళూరు తీర్మానం” పిలుపు

జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్‌డివ) యొక్క ఎజెండా అనే పేరుతో గతంలో, లోకసభ ఎన్నికలు జరిగేముందు (1999) జాతీయ ప్రజాస్వామ్య కూటమి తన ఎన్సికల కార్యాచరణ పత్రాన్ని(మ్యాని ఫెస్టో) తయారు చేసింది. ఈ కార్యాచరణ పత్రంలో, తాము గెలిచినప్పుడు తీసుకొనిరాబోయే కొన్ని రాజ్యాంగ మరియు చట్టపరమైన సంస్కరణలను ప్రతిపాదించారు. ఇందులో భాగంగా, నం. 25వ అంశం, పేజి 131లో పేర్కొన్న విషయం ఇట్లా ఉంది: “రాజ్యాంగంలోని షెడ్యూల్‌ 8లో చేర్చబడిన మొత్తం 19 భాషలను అధికారిక భాషలుగా పరిగణించే సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం” అని పేర్కొంది. 2003లో తీసుకువచ్చిన రాజ్యాంగ సవరణద్వారా ఎనిమిదవ షెడ్యూలులో ఉన్నవాటికి మరో మూడు భాషలను చేర్చగా- మొత్తం 22 భాషలు అయినై. పైన ఉటంకించినదానికి అనుగుణంగా మొత్తం 22 భాషలనూ భారత సమాఖ్య అధికార భాషలుగా చట్టబద్ధతను కల్ఫించేందుకు అనువుగానూ వివిధ భారతీయభాషల మధ్య ఉన్న అసమానత్వాన్ని తొలగిస్తూ భారత పార్లమెంటు కార్యాచరణను మొదలుపెట్టేందుకు వీలుగా, ఈ యేడాది, ఫిబ్రవరి 8-9వ తేదీలలో కన్నడ ప్రాధికార సంస్థ అధ్యక్షులు శ్రీ టి. ఎస్‌. నాగాభరణగారి ఆధ్వర్యంలో, డాక్టర్‌ వి.పి. నిరంజనారాధ్య కార్యనిర్వహణలో, డాక్టర్‌ కె. మురలీధర్‌ కార్యదర్శకత్వంలో బెంగుళూరులో రెండురోజుల చర్చా సమావేశం జరిగింది. ఆ సమావేశానంతరం, భారతీయ భాషల సాథికారితను సాధించేందుకు వీలుగా ఎనిమిదవ షెడ్యూలులో పేర్కొన్న 22 భాషల ఔత్సాహిక ప్రతినిధులకు అందరికీ ఆమోదయోగ్యమైన తీర్మానం ప్రతిని తయారుచేయడం జరిగింది. ఈ తీర్మానం అనువాదాలను 22 భాషలలోనూ ఫిబ్రవరి 21వ తేదీన నిర్వహించబోయే మాతృభాషా దినోత్సవ సందర్భంగా దేశమంతటా విడుదల చేసేందుకు వీలుగా కన్నడ ప్రాధికార సంస్థ చర్యలు చేపట్టింది. ఈ తీర్మానానికి తెలుగు అనువాదం ఈ కింద ఇస్తున్నాం.

భారతీయ భాషల సాధికారతకు బెంగళూరు తీర్మానం

భాషా హక్కుల కోసం మేము, అన్ని రాష్ట్రాలూ మరియు కేంద్రపాలిత ప్రాంతాల సభ్యులమూ కలిసి మన రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్‌లోని జాబితాలో పేర్కొన్న భాషాహక్కుల సమానత్వాన్ని సాధించే అంశంపై చర్చించాము. రెండు రోజుల చర్చల తరువాత, భారత రాజ్యాంగానికి తప్పనిసరిగా ఇందుకు అవసరమైన సవరణను తీసుకురావాలని భారత ప్రభుత్వానికి గట్టిగా పిలుపునిస్తూ ఈ బృందం ఏకగ్రీవంగా “బెంగళూరు తీర్మానాన్ని” ఆమోదించింది.

అయితే, భారత సమాఖ్య అనేక భాషలను మాట్లాడే వ్యక్తులతో కూడి, ప్రతి భాషకూ దానికే స్వంతమైన గొప్ప చరిత్రతోనూ ఆయా భాషలను మాట్లాడే ప్రజల సంస్కృతితోనూ విడదీయరాని అనుబంధం కలిగి ఉంది.

కాగా, భారత రాజ్యాంగం, ఎనిమిదవ షెడ్యూల్‌లో, దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ మాట్లాడే ఇరవై రెండు భాషలను సమాఖ్య యొక్క భాషా వైవిధ్యానికి ఆనవాలుగా గుర్తించింది.

కాగా, భారత సమాఖ్య, భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల సమాఖ్యగా ఏర్పడింది, ఈ సమాఖ్య లక్షణమే భారత రాజ్యాంగంలోని మౌలిక వైఖరి.

కాగా, భారత రాజ్యాంగం దేశంలోని పౌరులందరికీ విద్య మరియు ఉపాధికి సమాన అవకాశాలకు హామీ ఇస్తుంది.

అయితే, భారత సమాఖ్య పరిధిలోని విద్యాసంస్థలలో ప్రవేశ పరీక్షలనూ, ఉపాధి అవసరాల కోసం అర్హత పరీక్షలనూ నిర్వహిస్తున్న ప్రస్తుత పద్దతి - ఎనిమిదవ 'షెడ్యూల్‌ ప్రకారం అన్ని భాషలు మాట్లాడేవారి అవసరాలను సరైన రీతిలో తీర్చదు.

సమాఖ్య చేసిన చట్టాలూ నియమాల గురించిన సమాచార హక్కును కలిగి ఉండటమూ వాక్స్వాతంత్య్రమూ వ్యక్తీకరణ స్వాతంత్యమూ ప్రాథమిక హక్కులో భాగమే - అయితే, అటువంటి చట్టాలూ నియమాలూ చాలామంది పౌరులకు అర్ధంకాని భాషలలో తయారైతే అ హక్కులకు భంగం కలిగించినట్లే.

కావున, ఈ మహత్తరమైన సమావేశంలో ఈ కింది విధంగా తీర్మానించబడింది:

1. ఎనిమిదవ పెడ్యూల్‌లోని అన్ని భాషలనూసమాఖ్య యొక్క అధికారిక భాషలుగా గుర్తించడానికి రాజ్యాంగాన్ని సవరించాలని కేంద్ర పార్లమెంటుకు పిలుపునిచ్చారు.

2. ఎనిమిదవ షెడ్యూల్‌లోని అన్ని అధికారిక భాషలలోనూ చట్టాలూ, నియమాలూ మరియు అధికారిక ప్రకటనలనూ ప్రచురించడానికి, రాజ్యాంగాన్ని సవరించాలని కేంద్ర పార్లమెంటుకు పిలుపునిచ్చారు.

3. ఎనిమిదవ షెడ్యూల్‌లో ఉన్న అన్ని అధికారిక భాషలలోనూ సమాఖ్య పరిధిలోని పదవులలో నియామకాలకు విద్యాసంస్థల ప్రవేశపరీక్షల నిర్వహణకు వీలుగా హామీ ఇవ్వడానికి రాజ్యాంగాన్ని సవరించాలని కేంద్ర పార్లమెంటుకు విలుపునిచ్చారు.

4. ఎనిమిదవ షెడ్యూల్‌లోని అన్ని భాషలలోనూ అన్ని కొత్త చట్టాలనూ, నియమాలనూ మరియు అధికారిక ప్రకటనలనూ వెంటనే ప్రచురించాలని కేంద్ర ప్రభుత్వానికి పిలుపునిచ్చారు.

5. ఎనిమిదవ షెడ్యూల్‌లోని అన్ని భాషలలోనూ ఉన్న అన్ని చట్టాలనూ, నియమాలనూ మరియు అధికారిక ప్రకటనలనూ క్రమంగా ప్రచురించాలని కేంద్ర ప్రభుత్వానికి పిలుపునిచ్చారు.

6. సమాఖ్య పరిధిలోని విద్యాసంస్థలలో అన్ని ప్రవేశపరీక్షలనూ ఎనిమివవ 'షెడ్యూల్‌లోని అన్ని భాషలలోనూ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వమూ దాని అన్ని ప్రాతినిధ్య సంస్థలకూ పిలుపునిచ్చారు.

7. సమాఖ్య పరిధిలోని అన్నిస్థానాలలో నియామకాల కోసం అన్ని పరీక్షలనూ ఎనిమిదవ 'షెడ్యూల్‌ యొక్క అన్ని భాషలలోనూ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం మరియు దాని అన్ని ప్రాతినిధ్య సంస్థలకూ పిలుపునిచ్చారు.

8. కేంద్ర ప్రభుత్వమూ దాని అన్ని ప్రాతినిధ్య సంస్థలూ (వాటి సామర్భ్యాలమేరకు), సమాఖ్య ప్రజలకు అందించే అన్ని 'సేవలనూ ఎనిమిదవ షెడ్యూల్‌లోని అన్ని భాషలలోనూ అందించేలా చూడాలి.

9. కేంద్ర ప్రభుత్వమూ దాని అన్ని ప్రాతినిధ్య సంస్థలూ(వాటి సామర్థ్యాల మేరకు) కేంద్ర ప్రభుత్వం లేదా దాని అధికారికసంస్థలూ జారీ చేసిన అన్ని ప్రసంగాలూ, ప్రకటనలూ, విజ్ఞప్తలూ ఎనిమిదవ షెడ్యూల్‌లోని అన్ని భాషలలోకి అనువదించేలా చూడాలి.

అనుబంధం:

ప్రతిపాదిత నవరణ బిల్లు -2021 రాజ్యాంగంలోని అధికరణం 343కు ఈ కింది అధికరణం ప్రత్యామ్నాయంగా ఉంటుంది.అధికరణం 343

(1) సమాఖ్య యొక్క అధికారికభాషలుగా ఆంగ్లభాషతోపాటు ఈ రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్‌లో పేర్ళాన్న అన్ని భాషలూ ఉండాలి.

(2) సమాఖ్య యొక్ష అధికారిక ప్రయోజనాల కోసం ఉపయోగించాల్సిన అంకెల రూపం భారతీయ అంకెల యొక్క అంతర్జాతీయ రూపంలో ఉండాలి.

(3) సమాఖ్య చేసిన అన్ని చట్టాలూ నియమాలూ అధికారిక ప్రకటనలనూ ఈ అధికరణం అమలులోకి వచ్చున తేదీ నుండి సమాఖ్య యొక్క అన్ని అధికారిక భాషలలో జారీచేసిన వెంటనే ప్రచురించబడతాయి.

(4) సమాఖ్య చేసిన అన్ని చట్టాలూ నియమాలూ అధికారిక ప్రకటనలూ ఈ అధికరణం అమల్లోకి వచ్చే తేదీకి ముందు సమాఖ్య చేసిన అన్ని చట్టాలూ నియమాలూ అధికారిక ప్రకటనలూ సమాఖ్య యొక్క అన్ని అధికారిక భాషలలో సహేతుకమైన వ్యవధిలో ప్రచురించబడతాయి.

(5) సమాఖ్య స్థాపించిన విద్యాసంస్థలలో ప్రవేశం కోసం సమాఖ్య లేదా సమాఖ్య తరపున ఏదైనా అధికారిక సంస్థ నిర్వహించే అన్ని పరీక్షలూ సమాఖ్య యొక్క అన్ని అధికారిక భాషలలోనూ నిర్వహించబడతాయి.

(6) సమాఖ్య లేదా పార్లమెంటు చేత చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏదైనా అధికారిక సంస్థతో సహా ప్రభుత్వరంగ సంస్థ లేదా సమీకృత భారతీయ నిధితోనో సమాఖ్య యొక్క సంపూర్ణనిధులతోనో నియంత్రణలో ఉన్న సంస్ధల సేవలలో నియామకాల కోసం అన్ని పరీక్షలూ సమాఖ్య యొక్క అన్ని అధికారిక భాషలలోనూ జరగాలి

(7) ఈ అధికరణం యొక్క (2) నిబంధన ప్రకారం రాష్ట్రపతి జారీ చేసిన అన్ని ఉత్తర్వులూ సవరణకు ముందు ఉన్నట్లే హిందీ భాషతోపాటు సమాఖ్య యొక్క అన్ని అధికారిక భాషలనూ చేర్చాలని భావించడమైనది.

భారతీయ భాషలను సాధికారపరిచే బెంగళూరు తీర్మానాన్ని మరియు సవరణ బిల్లుని ఆమోదించినవారు:

శీ టి.ఎస్‌. నాగాభరణ(అధ్యక్షులు), డాక్టర్‌ కె. మురశీధర్‌(కార్యదర్శి), డాక్టర్‌ వి.పి. నిరంజనారాధ్య(కార్యనిర్వాహకుడు), ప్రొ॥ జి. ఉమామహేశ్వరరావు(తెలుగు), శ్రీ సెంథిల్‌నాథన్‌ (తమిళం), శ్రీ ఆనంద్‌ జి.(కన్నడ), ప్రొఫెసర్‌ జోగా సింహవిర్మ్‌(పంజాబీ), శ్రీ ఖుముక్కం చింగ్లెన్‌లువాంగ్‌ (మైధిలీ), శ్రీసాకేత్‌ శ్రీభూషణ్‌ సాహు (ఒడియా), ప్రొ॥ ముసావిర్‌ అహ్మద్‌(కాశ్మీరీ), శ్రీ తారిక్‌ కుమార్‌ దత్తా (బెంగాలీ), ప్రొఫెసర్‌ జోగ్‌రాజ్‌ (ఉర్దూ), శ్రీమతి దీప్తి పి.పట్జిరి (అస్సామీ), శ్రీమతి శ్యామాసింగ్‌(హిందీ), శ్రీ నందకుమార్‌ (మలయాళం), డాక్టర్‌ ప్రకాష్‌ పరాబ్‌(మరాఠీ), శ్రీ బి. కె. ఝా(మైథిలి), శీ రితురాజ్‌ శర్మ(డోగ్రి), ప్రొఫెసర్‌ కె.ఇ. దేవనాథన్‌ (సంస్కృతం), శ్రీమతి ఆశాచంద్‌(సింథి).

| తెలుగుజాతి పత్రిక అమ్మనుడి ఆ మార్చి-2021 |